వనపర్తి జిల్లా రైతుల విజయగాధ

July 10, 2019


img

ఒకప్పుడు వనపర్తి జిల్లాలో పెద్దమందడి, అనకాయపల్లి పరిసర ప్రాంతాలలో నీళ్ళు లేక ఎక్కడ చూసినా బీడుభూములే కనిపించేవి. కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో వాటి మద్య నీటి కుంటలతో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి  వచ్చినందున ఈ మార్పు వచ్చిందనుకుంటే పొరపాటే.

స్థానిక ప్రభుత్వాధికారులు, గ్రామ పంచాయితీలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా సాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు. పెద్దమందాడి సమీపంలో చిన్న కొండ ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు కొండపై నుంచి క్రిందకు ప్రవహించే నీరు వృధాగా పారేది. ఆ నీటిని ఒడిసిపట్టగలిగితే నీటి సమస్య తీరుతుందని గ్రహించిన గ్రామప్రజలు, అధికారులు ఉపాధి హామీ పధకం క్రింద పెద్దమందడి, అనకాయపల్లి పరిసర ప్రాంతాలలో అనేక నీటి కుంటలు, చెక్ డ్యాములు నిర్మించుకున్నారు. దాంతో వర్షపు నీరు ఆ కుంటలలో నిండిన తరువాత చెక్ డ్యాములకు...అక్కడి నుంచి పొలాలకు చేరడం ప్రారంభించింది. దాంతో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయని అనకాయపల్లి గ్రామ సర్పంచ్ చెప్పారు. ఒకప్పుడు 500 అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్ళు వచ్చేవి కావని, ఇప్పుడు 250-300 అడుగులకే సమృద్ధిగా నీళ్ళు పడుతున్నాయని చెప్పారు. నీటి కుంటలలో కూడా నీళ్ళు నిలిచి ఉండటంతో ముందుగా ఆ నీటితో వ్యవసాయం చేసుకున్నామని ఆ తరువాతే బోర్లు వినియోగించమని స్థానిక రైతులు చెప్పారు. 

ఉపాధి హామీ పధకం అధికారి మాట్లాడుతూ, “పరిసర గ్రామాలలో నీటి సమస్య తీరడంతో మా ప్రయత్నాలు ఫలించినట్లయింది. ఈ పధకం గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవడం చేతనే ఇంతకాలం ఎవరూ ముందుకు రాలేదు. ఈ పధకం ద్వారా కొండదిగువ ప్రాంతంలో మేము చేపట్టిన నీటి కుంటల తవ్వకాలతో గ్రామంలో నీటి లభ్యత పెరగడంతో ఇప్పుడు గ్రామస్తులు కూడా తమ పొలాలలో నీటికుంటలు తవ్వాలని దరఖాస్తు చేసుకొంటున్నారు. రైతులు గ్రామ పంచాయతీలలో దరఖాస్తు ఇస్తే మేము వచ్చి పరిశీలిస్తాము. ఈ పధకంలో రైతులు కేవలం కొంత భూమి కేటాయించవలసి ఉంటుంది. నీటికుంటల తవ్వకానికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది,” అని చెప్పారు.          

ప్రభుత్వం అందిస్తున్న సాయంతో నీటి కుంటల తవ్వుకోవడం వలన ఇంత ప్రయోజనం ఉందని గ్రహించిన పరిసర ప్రాంతాలలోని పలు గ్రామాలలోని రైతులు తమ పొలాలోనే నీటి కుంటలు తవ్వించుకున్నారు. పొలం విస్తీర్ణం బట్టి కొందరు రైతులు ఎకరం విస్తీర్ణంలో కుంటలు తవ్వించుకుంటే, ఎకరం అంతకంటే తక్కువ పొలం ఉన్న చిన్న చిన్న నీటికుంటలు తవ్వుకున్నారు. ఈ ఏడాది వేసవిలో కూడా తమకు నీటి ఎద్దడి లేకుండా రెండు పంటలు పండించుకున్నామని రైతులు ఆనందంగా చెపుతున్నారు. 

హైదరాబాద్‌, సికిందరాబాద్‌, వరంగల్‌ వంటి పెద్ద నగరాలలో, పట్టణాలలో పెద్దపెద్ద భవనసముదాయాలను నిర్మించే బిల్డర్లు, ఇంజనీర్లకు వర్షపునీటిని భూమిలోకి ఇంకించాలనే స్పృహ కొరవడటం వలన 1200 అడుగుల వరకు భూమిని తొలిచివేసి బోర్లు వేసినా నీరు పడటం లేదిప్పుడు కానీ వనపర్తి జిల్లాలో మారుమూల గ్రామాలైన పెద్దమందాడి, అనకాయపల్లి గ్రామాలలో పెద్దగా చదువుకొని రైతులు నీటికుంటలు తవ్వుకొని భూగర్భజలాలను పెంచుకొని ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. 


Related Post