ఇప్పుడు వారికి అవకాశం వచ్చింది అందుకే...

July 09, 2019


img

తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలలో గందరగోళం...ఆ కారణంగా 27మంది విద్యార్దుల ఆత్మహత్యలు, కాగజ్‌నగర్‌ మండలంలో తెరాస నేత కృష్ణారావు నేతృత్వంలో అటవీశాఖ అధికారులపై దాడి అంశాలను కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడాన్ని తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తప్పు పట్టారు.

"కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలకు పార్లమెంటుకు అసెంబ్లీకి తేడా తెలిసినట్లులేదు. అందుకే గల్లీలో మాట్లాడవలసిన విషయాల గురించి డిల్లీలో మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబందించిన అంశాలపై పార్లమెంటులో రాజకీయం చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి పార్లమెంటులో విమర్శిస్తూ తప్పుగా మాట్లాడటం సరికాదు. ప్రశ్నించే గొంతుకలే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి,” అని అన్నారు. 

తెరాస ప్రభుత్వానికి పూర్తిమెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో తమకు ఎదురే ఉండరాదనే ఆలోచనతో కాంగ్రెస్‌, టిడిపిల ఎమ్మెల్యేలను, నేతలను తెరాసలోకి ఫిరాయింపజేసుకొని ప్రతిపక్షాలను బలహీనపరిచింది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనుకోవడం సరికాదని ప్రతిపక్షాలు ఎంతగా వాదించినప్పటికీ తెరాస పట్టించుకోలేదు.

తమకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిస్తే ఇక తమకు ఎదురేఉండదని తెరాస భావిస్తే, ఈ రాజకీయ శూన్యతను బిజెపి ఒక గొప్ప అవకాశంగా భావించి దూసుకువస్తోంది. కనుక తమకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలను ఉపయోగించుకొంటూ తెరాసను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

తెరాస రాజకీయ ప్రయోజనాల కోసం తమ పార్టీని, తమ రాజకీయ భవిష్యత్తును కూడా దారుణంగా దెబ్బ తీసినందుకు కాంగ్రెస్‌ నేతలు తెరాసపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం సహజం. కనుక వారు ఈవిధంగా పార్లమెంటులో తెరాస సర్కారుకు ఇబ్బంది కలిగించే సమస్యలను ప్రస్తావిస్తున్నారని భావించవచ్చు.  

తెరాసను దెబ్బ తీయడం సాధ్యమా కాదా? అనే ప్రశ్నను పక్కనపెడితే, కాంగ్రెస్‌, బిజెపిలకు ఇప్పుడు అవకాశం లభించింది కనుక అవి ప్రయత్నించడం సహజం. ఈ పరిణామాలు తెరాసకు ఆందోళన కలిగించడం కూడా సహజమే. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలను బ్రతకనిచ్చి ఉండి ఉంటే నేడు తెరాసకు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చేదే కాదు. తాము చేసినవన్నీ ఒప్పు ప్రతిపక్షాలు చేస్తే తప్పు అనుకొని వాదించి ఇప్పుడు ప్రయోజనం లేదు కనుక ఇప్పుడు వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచించడం మంచిది. 


Related Post