తెరాసకు సోమారపు గుడ్ బై!

July 09, 2019


img

తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్, తెరాస సీనియర్ నేత సోమారపు సత్యనారాయణ తన అనుచరులతో కలిసి తెరాస ప్రాధమిక సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నుంచి పోటీ చేసి తెరాస రెబెల్ అభ్యర్ధి కోరుకంటి చందర్‌ చేతిలో ఓడిపోయిన సోమారపు, ఆ ఎన్నికలలో తెరాస ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరికొందరు ముఖ్యనేతల కుట్ర కారణంగానే ఓడిపోయానని ఆరోపించారు. “నేను అడగకుండానే సిఎం కేసీఆర్‌ నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. కానీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి పార్టీలో నాకు సముచిత స్థానం, గౌరవం లభించడం లేదు. కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఇవ్వకుండా అవమానించారు. పార్టీలో క్రమశిక్షణ లోపించింది. ఈ పరిస్థితులలో నేను తెరాసలో ఉండలేకనే పార్టీని వీడుతున్నాను. అయితే నేను ఏ పార్టీలో చేరాలనుకోవడం లేదు, ” అన్నారు సోమారపు సత్యనారాయణ.

అసెంబ్లీ ఎన్నికలలో సోమారపు సత్యనారాయణ పరాజయానికి కారణమైన కోరుకంటి చందర్‌ను మళ్ళీ తెరాసలో చేర్చుకోవడంతోనే సమస్య మొదలైనట్లు సమాచారం. బాల్క సుమన్ తదితరులతో వర్గ విభేధాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. సిఎం కేసీఆర్‌ బాల్క సుమన్‌కే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి తనను పట్టించుకోకపోవడంత సోమారపులో అసంతృప్తి మొదలైంది. పార్టీలో తనను పక్కన పెడుతున్నారనే భావన క్రమంగా పెరిగింది, తాజాగా సభ్యత్వనమోదు ప్రక్రియకు తనను దూరంగా ఉంచడంతో ఇంక పార్టీలో కొనసాగడం అనవసరమని నిర్ణయించుకొని ఇవాళ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఇప్పుడు ఏ పార్టీలోను చేరబోనని సోమారపు చెపుతున్నప్పటికీ ఇటువంటి అసంతృప్త నేతల కోసమే ఎదురుచూస్తున్న బిజెపి ఆయనను పార్టీలోకి ఆకర్షించడం ఖాయం. ఒకవేళ బిజెపి కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు. 


Related Post