అన్ని రాష్ట్రాలను బిజెపి కబళించకమానదు: శివసేన

July 09, 2019


img

దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి దేశమంతటా అధికారంలోకి రావాలని భావిస్తున్న బిజెపి ప్రస్తుతం కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాలపై కన్నేసింది. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న బిజెపి, మరోపక్క కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపద్యంలో బిజెపి మిత్రపక్షం, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉన్న శివసేన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు ఇక ఎంతో కాలం నిలువలేవు. కర్ణాటకలో జరుగుతున్న తాజా పరిణామాలను ఇందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్‌-జెడిఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటిరోజునే, అది ఎంతో కాలం నడువదని ఊహించాము. ఇప్పుడు అదే జరుగుతోంది. కుమారస్వామి మద్దతుతో సిద్దరామయ్య మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకొంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. కర్ణాటకతో సహా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బిజెపియేతర ప్రభుత్వాలు మనుగడ సాధించడం కష్టమే,” అని పేర్కొంది.   

ఇటీవల ఒక కాంగ్రెస్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విస్తరణ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. "బురదలోనే కమలం వికసిస్తుంది. అందుకే దేశమంతటా బురదను వ్యాపింపజేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది," అని అన్నారు.  

కర్ణాటకలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఉదాహరణగా చూపుతూ దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని శివసేన చెప్పడానికి అర్ధం వాటిని కబళించివేసేందుకు బిజెపి గట్టిగా ప్రయత్నిస్తోందని చెప్పినట్లుగానే భావించవచ్చు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో ఇటువంటి వ్యూహంతో అక్కడ కాషాయజెండా ఎగురవేసిన బిజెపి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో కూడా అదే వ్యూహం అమలుచేయడానికి సిద్దం అవుతోందని కర్ణాటకలోని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక తెరాస, వైసీపీలు కూడా బిజెపిని ఎదుర్కోవడానికి సిద్దం కావాల్సిందే.


Related Post