ఇంటివద్దనే పింఛను చెల్లింపు: జగన్

July 08, 2019


img

సోమవారం కడప జిల్లాలో జరిగిన రైతు దినోత్సవ సభలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ, “ఇక నుంచి రాష్ట్రంలో పింఛనుదారులు బ్యాంకులకు వెళ్ళనవసరం లేదు. గ్రామ, పట్టణ వాలంటీర్లు పించను సొమ్మును నెలనెలా మీ ఇంటికే తెచ్చి అందిస్తారు. ఈ నెల నుంచి నెలకు రూ. 2,250 పించను ఇవ్వబోతున్నాము. రాష్ట్రంలో కొత్తగా 5.4 లక్షల మందికి పించన్లు మంజూరు చేయబోతున్నాము. 

రాష్ట్రంలో రైతులకు వడ్డీ లేని పంటరుణాలు ఇవ్వాలని నిర్ణయించాము. మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కడప జిల్లా రైతులకు రూ.1,000 కోట్లు రుణాలు ఇచ్చాము. దీనికోసం ఈ ఏడాదికి రూ.84,000 కోట్లు కేటాయించబోతున్నాము. 

వైఎస్ఆర్ రైతు భరోసా పధకాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచే ప్రవేశపెడుతున్నాము. దీని క్రింద రాష్ట్రంలో కౌలు రైతులతో సహా ప్రతీరైతుకు ఏడాదికి రూ.12,500 అందిస్తాము. ఈ పధకం క్రింద రాష్ట్రంలో 70 లక్షలమంది రైతులకు ఈ ఏడాదికి రూ.8,750 కోట్లు అందించబోతున్నాము. అలాగే వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాము. గత ప్రభుత్వం రైతులకు ఎగవేసిన బకాయిలను సైతం చెల్లిస్తున్నాము,” అని అన్నారు.

జూన్ 30వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన పధకాలు, ఇచ్చిన హామీలు అన్నీ కూడా  ప్రభుత్వంపై చాలా భారం పెంచేవే. నేటికీ కేంద్రం సహాయసహకారాలు లేనిదే ముందుకుసాగలేకపోతున్న ఏపీ ప్రభుత్వం, ఈ హామీలకు, వరాలకు ఏవిధంగా నిధులు సమకూర్చుకొంటుందనే ప్రశ్నకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కనుక ఈ పధకాలను జగన్‌మోహన్‌రెడ్డి ఏవిధంగా అమలుచేస్తారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.


Related Post