తెరాసకు సెగ తగిలింది

July 04, 2019


img

తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నికైన బిజెపి ఎంపీ బండి సంజయ్ నిన్న లోక్‌సభలో మాట్లాడుతూ తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలలో అవకతవకలు, విద్యార్దుల ఆత్మహత్యలు, కేసీఆర్‌ ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి గురించి ప్రస్తావించి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దానిపై నేడు తెరాస ఎంపీలు అభ్యంతరం తెలిపారు. రాష్ట్రనికి సంబందించిన అంశాలను శాసనసభలోనే ప్రస్తావించాలని, బండి సంజయ్ చెప్పిన ఆ అంశాలను లోక్‌సభ రికార్డులలో నుంచి తొలగించాలని వారు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. 

పార్లమెంటులో ఇటువంటి ఫిర్యాదుల వలన మున్ముందు తమ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చునని తెరాస గ్రహించినట్లే ఉంది. అందుకే రాష్ట్రానికి సంబందించిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడం సరికాదని, వాటిని రికార్డులలో నుంచి తొలగించాలని కోరింది. కానీ బండి సంజయ్ తమ పార్టీ అధిష్టానం వైఖరికి అనుగుణంగా రాష్ట్రానికి చెందిన ఈ అంశాన్ని ఉద్దేశ్యపూర్వకంగా పార్లమెంటులో ప్రస్తావించి ఉంటారని వేరే చెప్పక్కరలేదు. అలాగే సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి కూడా ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే కాగజ్‌నగర్‌లోని కొత్త సార్సాల గ్రామంలో, భద్రాద్రి కొత్తగూడెంలో అటవీశాఖ అధికారులపై జరిగిన దాడులను ప్రస్తావించి ఉండవచ్చు. వాటిపై తెరాస ఎంపీలు అభ్యంతరం చెప్పగలరు కానీ రాష్ట్రానికి సంబందించిన సమస్యల గురించి వారు పార్లమెంటులో ప్రస్తావించకుండా అడ్డుకోలేరు. కనుక తెరాస సర్కారుకు మున్ముందు కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదేమో?


Related Post