కొత్త ఎంపీలతో తెరాస సర్కారుకు కొత్త చిక్కులు

July 03, 2019


img

కొత్త ఎంపీలతో తెరాస సర్కారుకు కొత్త చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. గత ఐదేళ్ళలో పార్లమెంటులో తెరాస ఎంపీలు తెలంగాణ సమస్యల పరిష్కారం గురించి, తమ ప్రభుత్వం గొప్పదనం గురించి మాత్రమే మాట్లాడేవారు కనుక ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ లోక్‌సభలో మొదటిసారి అడుగుపెట్టిన కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటిపై తెరాస సర్కారు చాలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని, కనుక కేంద్రప్రభుత్వం చొరవ తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

రేవంత్‌ రెడ్డి లోక్‌సభలో ప్రసంగిస్తూ ఇటీవల కాగజ్‌నగర్‌లోని కొత్త సార్సాల గ్రామంలో, భద్రాద్రి కొత్తగూడెంలో అటవీశాఖ అధికారులపై జరిగిన దాడులను ప్రస్తావించి, అడవులలో ఆదివాసీలు పోడు చేసుకొని ప్రశాంతంగా జీవిస్తుంటే తెరాస సర్కార్ వారిని అక్కడి నుంచి వెళ్ళగోట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రభుత్వానికి, ఆదివాసీలకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. కనుక ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని ఆదివాసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

బిజెపి ఎంపీ బండి సంజయ్ తెలుగులో ప్రసంగిస్తూ, ఇంటర్ విద్యార్ధులు ఎదుర్కొన్న సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ తెరాస సర్కారు స్పందించలేదని, చివరికి గవర్నర్‌ నరసింహన్‌ హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని కనుక ఈ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం విచారణ జరిపించి ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్దుల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణలో కూడా పట్టు సాధించాలని బిజెపి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సార్సాల గ్రామంలో జరిగిన దాడిపై కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవాడేకర్ రెండు రోజుల క్రితమే రాజ్యసభలో ప్రస్తావించి దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఇప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు తెరాస సర్కారుపై ఫిర్యాదులు చేయడం, కేంద్రం జోక్యం కోరడంతో, ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొంటే తెరాస సర్కారుకు కొత్త చిక్కులు ఎదుర్కోవలసి రావచ్చు.


Related Post