130 ఏళ్ళ కాంగ్రెస్‌ పార్టీకి 90 ఏళ్ళ వోరా అధ్యక్ష బాధ్యతలు!

July 03, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి రాహుల్ గాంధీ ససేమిరా అనడమే కాకుండా తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణమే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీని సమావేశపరిచి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ సూచించడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం అయ్యింది. దాంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఇవాళ్ళ అత్యవసరంగా సమావేశమయ్యి 90 సం.ల వయసున్న మోతీలాల్ వోరాను పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. కొత్త అధ్యక్షుడుని ఎన్నుకునేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన మోతీలాల్ వోరా పార్టీలో అందరికంటే సీనియర్ నేత, నేటికీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 

రాహుల్ గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నట్లు ప్రకటించడమే కాకుండా ట్విట్టర్‌లో కూడా ఆ హోదాను తొలగించి, తన హోదాను కాంగ్రెస్‌ సభ్యుడు, ఎంపీగా మార్చుకున్నారుపార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి కారణాలు వివరిస్తూ పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి నాలుగుపేజీల సుదీర్ఘమైన లేఖలో కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు రాహుల్ గాంధీ పార్టీలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. లోక్‌సభ ఎన్నికలలో దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాను మోడీ, బిజెపి, రాష్ట్రీయ స్వయంసేవక్‌లతో ఒంటరిపోరాటం చేశానని, అందుకు తాను చాలా గర్వపడుతున్నానని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలలో చాలామంది అలసత్వం ప్రదర్శించడం వలననే లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిందని రాహుల్ గాంధీ వాదన. అందుకే తాను ఎన్నికలలో ఒంటరిపోరాటం చేశానని మళ్ళీ నొక్కి చెప్పారు. కనుక పార్టీ నేతల వైఖరిలో మార్పు రావలసిన అవసరం ఉందని చెప్పకనే చెప్పారు. కానీ మూస పద్దతిలో రాజకీయాలు చేయడానికి అలవాటుపడిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతారనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని కూడా రాహుల్ గాంధీ సూచిస్తున్నారు. కాంగ్రెస్‌ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్న ఈ తాజా పరిణామం ఆ పార్టీని ఎటువైపు తీసుకువెళుతుందో చూడాలి. 


Related Post