జగన్ వైఖరి తెరాసకు ఇబ్బందికరం

July 03, 2019


img

నేటి నుంచి రెండురోజుల పాటు ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అమరావతిలో శిక్షణా తరగతులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, “శాసనసభలో ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచన సరికాదు. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో ఐదుగురిని మనపార్టీలో చేర్చుకుంటే టిడిపి సభలో ప్రతిపక్షహోదా కోల్పోతుందని నాకు మనవాళ్ళు కొందరు సలహా ఇచ్చారు. కానీ మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే మనకూ వాళ్ళకూ తేడా ఏమిటి? 

ఒకవేళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా మన పార్టీలో చేరాలనుకుంటే ముందుగా వారు తమ పదవులకు రాజీనామాలు చేసి రావాలి లేదా అనర్హత వేటు వేయించుకునేందుకు సిద్దపడిరావాలి. ఆ తరువాత వారు ఉపఎన్నికలలో మన పార్టీ తరపున పోటీచేసి గెలిచినప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందుతారు. ప్రజాస్వామ్యంలో ఇదే సరైన విధానం. 

మన ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి శాసనసభలో ప్రతిపక్షాలు మనల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు, వాటికి మనం ధీటుగా..సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగితేనే మనకు గౌరవంగా ఉంటుంది. అప్పుడే మనకూ, గత ప్రభుత్వానికి మద్య ఉన్న తేడాను ప్రజలు కూడా చూడగలుగుతారు. కనుక అసెంబ్లీ, మండలి సమావేశాలలో మాట్లాడాలనుకొనేవారు ఆయా అంశాలపై క్షుణ్ణంగా అవగాహన ఏర్పరచుకొని, సభలో వాటిని ఏవిధంగా చెప్పాలో కూడా బాగా ప్రాక్టీస్ చేసి రావాలని కోరుకొంటున్నాను. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు తగినంత సమయం కేటాయిస్తాము కనుక వారితో వాగ్వాదాలు చేయకుండా వారు చెప్పేదంతా ఓపికగా విన్న తరువాతే, వారి ఆరోపణలకు, వారడిగే ప్రశ్నలకు తగినవిధంగా సమాధానాలు చెప్పాలి తప్ప మద్యలో అడ్డుతగిలి వాదనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవద్దు,” అని అన్నారు. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న ఈ వైఖరి తెలంగాణ సిఎం కేసీఆర్‌కు, తెరాసకు చాలా ఇబ్బందికరంగా మారుతుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోవాలని జగన్‌ చెప్పిన ప్రతీసారి తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆయన మాటలను ప్రస్తావిస్తూ సిఎం కేసీఆర్‌ నిరంకుశ, అప్రజాస్వామిక వైఖరిని, రాష్ట్రంలో ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటాన్ని వారు తప్పు పడుతుంటారు. 

సిఎం కేసీఆర్‌ను జగన్‌తో పోల్చి చూపుతూ వారు చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందిపడుతున్నారు. కనుక ఈ సమస్యకు కూడా సిఎం కేసీఆర్‌ ఒక సరైన సమాధానం లేదా పరిష్కారం కనుగొనవలసి ఉంది. 


Related Post