విజయశాంతి పోరాటానికి సిద్దమవుతున్నారా?

July 02, 2019


img

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు పార్టీలో సీనియర్ నేతలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి మాత్రం ఆందోళన బాట పట్టి పార్టీని బ్రతికించుకోవడానికి సిద్దం అవుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు విద్యార్దుల నుంచి అధిక ఫీజులు వసూలుచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె పోరాటానికి సిద్దం అవుతున్నారు. 

రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకోవడాన్ని తప్పు పడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై విజయశాంతి స్పందిస్తూ, “రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని విద్యార్దులను వారి తల్లితండ్రులను నిలువుదోపిడీ చేస్తున్న కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలను కట్టడి చేయాలి లేకుంటే నేనే స్వయంగా వాటిపై ప్రత్యక్షపోరాటం మొదలుపెడతాను,” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ప్రజాసమస్యలపై ప్రతిపక్షనేతల పోరాటాలతో ఆ సమస్యలు పరిష్కారం అయినా కాకపోయినా వారు తమ ఉనికిని, తద్వారా పార్టీ ఉనికిని కూడాగట్టిగా చాటుకోగలుగుతారు. ఒకవేళ ‘ఇంటర్మీడియట్‌’ వంటి తీవ్ర సమస్య ఉన్నట్లయితే వారి పోరాటాల వలన ప్రభుత్వంపై కూడా  ఒత్తిడి పెరుగుతుంది. ఆ కారణంగా ప్రభుత్వం ఆ సమస్యలను  పరిష్కరించినట్లయితే ఆ క్రెడిట్ ప్రతిపక్షాలకు కూడా దక్కుతుంటుంది. కనుక ఫిరాయింపులతో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం విజయశాంతి ఎప్పటి నుంచి పోరాటం మొదలుపెడతారో చూడాలి. 


Related Post