త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు?

July 02, 2019


img

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించబోతున్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ నేటికీ నరసింహన్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఆయన గత 10 ఏళ్లుగా గవర్నర్‌గా కొనసాగుతున్నందున ఆయనను వేరే రాష్ట్రానికి బదిలీ చేసి, రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించడానికి కేంద్రహోంశాఖ భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే గవర్నర్‌ నరసింహన్‌ బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడలో గవర్నర్‌ కోసం బంగ్లాను సిద్దం చేస్తున్నందున కొత్త గవర్నర్ల నియామకం ఖాయమనే భావించవచ్చు. 

కొత్త గవర్నర్ల నియామకాలకు రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. నరసింహన్‌ 10 ఏళ్ళపాటు గవర్నర్‌గా  కొనసాగినందున మార్చాలనుకోవడం ఒక కారణమైతే, తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొని 2023 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తుండటం మరో కారణంగా చెప్పుకోవచ్చు. గవర్నర్‌ నియామకానికి, రాష్ట్రంలో బిజెపి బలపడటానికి సంబందం ఏమిటనే సందేహం కలుగవచ్చు. గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆ రాష్ట్రాల గవర్నర్లు బిజెపికి అనుకూలంగా ఏవిధంగా వ్యవహరించారో అందరూ చూశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌ కేసరీనాథ్ త్రిపాఠి మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ ఆమె ప్రభుత్వ పతనానికి సన్నాహాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో బిజెపి బలపడాలనుకొంటోంది కనుక వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాలలో అందుకు అనుకూలమైన వాతావరణం సృష్టించగలవారిని గవర్నర్లుగా నియమించాలనుకోవడం సహజమే. కనుక కొత్త గవర్నర్ల నియామకాలు కాస్త ఆలస్యం కావచ్చునేమో కానీ వారురావడం ఖాయమనే భావించవచ్చు.


Related Post