సచివాలయానికి రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు?

July 01, 2019


img

పాత సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది కట్టడానికి సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సోమవారం సచివాలయ భవనాల పరిశీలనకు వెళ్లారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, రామ్మోహన్ రెడ్డి, విజయరామారావు, కొండేటి శ్రీధర్ తదితరులు నేడు సచివాలయాన్ని సందర్శించారు. 

ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాత భవనాలను కూల్చివేసి కొత్తవి కట్టుకొంటే ప్రజాధానం వృధా కాదా? ప్రస్తుతం ఉన్న సచివాలయం మరో 50 ఏళ్ళ వరకు ఉపయోగించుకునేందుకు అనువుగా ఉన్నప్పుడు కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తున్నట్లు?అయినా ఏనాడూ సచివాలయానికి రాని సిఎం కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు?దాని కోసం వందల కోట్లు ప్రజాధనం వృధా చేయడమెందుకు? కేసీఆర్‌ చేస్తున్నవి తుగ్లక్ పనులు. పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు. 

అయితే న్యాయస్థానాలు అడ్డుకుంటే తప్ప పాత సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణం ఆగదని కాంగ్రెస్‌ నేతలకు కూడా తెలుసు. కానీ ఈవిషయంలో హైకోర్టు కలుగజేసుకోబోదని ఇప్పటికే చూచాయగా స్పష్టమైంది. కనుక కాంగ్రెస్‌ నేతల పోరాటం తమ ఉనికిని చాటుకోవడానికి, ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి మాత్రమే పనికి వస్తుందని చెప్పవచ్చు.


Related Post