కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారా?

June 29, 2019


img

మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ విద్యాశాఖమంత్రిగా కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయనకు పార్టీలో కానీ ప్రభుత్వంలోగానీ ఏ పదవీలేదు. కనుక పార్టీ కార్యక్రమాలలో  కూడా ఆయన పెద్దగా కనబడటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ హడావుడి చేశారు కానీ వాటిలో ఆయన ఎక్కడా కనబడలేదు! 

గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. కనుక అసంతృప్తితో ఉన్న ఆయనను బిజెపిలోకి ఆకర్షించడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర  రాజకీయాలపై మంచి అవగాహన, జిల్లా రాజకీయాలపై మంచి పట్టుకలిగి ఉండటం, ముఖ్యంగా దళితవర్గానికి చెందిన నాయకుడై ఉండటంతో కడియం శ్రీహరిని బిజెపిలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

అయితే గత ప్రభుత్వంలో ఎంతో గౌరవమర్యాదలు పొందిన కడియం శ్రీహరిని ఈసారి సిఎం కేసీఆర్‌ ఎందుకు పక్కనపెట్టారు? అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు కానీ ఆ సీటును సిఎం కెసిఆర్ రాజయ్యకు కేటాయించడంతో ఆయనలో అసంతృప్తి మొదలవడం సహజం. నామినేషన్లకు ముందు ఆయన అనుచరులు రాజయ్యను మార్చాలంటూ ఒత్తిడి చేయడం, అప్పుడు ఆయన కేసీఆర్‌ను కోరడం, కేసీఆర్‌ నిరాకరించడం వంటి పరిణామాలు జరిగాయి. అప్పుడే కడియం శ్రీహరికి కేసీఆర్‌కు మద్య దూరం పెరిగి ఉండవచ్చు. గత ప్రభుత్వం విద్యాశాఖమంత్రిగా ఉన్నప్పుడు మల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడం మరో కారణంగా తెలుస్తోంది. 

నెలలు గడిచిపోతున్నా మంత్రివర్గ విస్తరణ ఊసు వినిపించడం లేదు కనుక ఇక వేచి చూడటంకంటే బిజెపి ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలోకి వెళ్లిపోవడమే మంచిదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నట్లు సమాచారం. పార్టీ మార్పు గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఆయన ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే ఆయన అటువంటి ఆలోచనలోనే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక కడియం శ్రీహరి మంత్రివర్గ విస్తరణ వరకు ఎదురుచూస్తారా లేక ముందుగానే పార్టీ మారుతారా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

జూలై 6వ తేదీ నుంచి రాష్ట్రంలో బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. అప్పటి నుంచి పార్టీలోకి బారీగా వలసలు ఉంటాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెపుతున్నారు. కనుక అప్పటికి కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కొంత స్పష్టత వస్తుందేమో చూడాలి. 


Related Post