టి-కాంగ్రెస్‌ నేతలతో నేడు రాహుల్ భేటీ

June 29, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ససేమిరా అంటున్న రాహుల్ గాంధీ, లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓటమిపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించాలనుకోవడం కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. పార్టీ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ తాను తప్పుకొంటున్నానని, రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం ఇంకా పదవులలో కొనసాగుతున్నారని రాహుల్ గాంధీ ఆక్షేపించడంతో వివిద రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కూడా నిన్న తన పదవికి రాజీనామా చేశారు. 

శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ డిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, ఫిరాయింపుల వ్యవహారాలు, రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రక్షాళన, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై వారితో చర్చించబోతున్నట్లు సమాచారం.  

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం తరువాత డిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఏఐసిసి కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఇద్దరూ కూడా పార్టీలో సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికలలో వారు చాలా అలసత్వం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన ముందుగా అధిష్టానం నుంచే మొదలుపెట్టాలని అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా చేపట్టబోయే వ్యక్తి అంత ధైర్యం చేయగలరో లేదో చూడాలి.


Related Post