పొన్నం ప్రభాకర్ రాజీనామా

June 28, 2019


img

కాంగ్రెస్ పార్టీలో తనతో సహా రాష్ట్ర స్థాయి నేతలవరకు అందరూ లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓటమికి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేయడమే కాకుండా అధ్యక్ష పదవిలో కొనసాగడానికి ససేమిరా అంటున్నారు. పైగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు కూడా తమ పదవులలో నుంచి గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని స్పష్టంగా హెచ్చరించడంతో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదవి లోనుంచి తప్పుకోవడానికి సంసిద్దత ప్రకటించినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు ముగిసేవరకు ఆయననే కొనసాగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 

అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితులలో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోరని ఆపార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఈరోజు మీడియాకు తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమయ్యి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొంటుందని మొయిలీ తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ తప్పుకోవడం ఖాయమైనట్లే. నెహ్రూ వారసత్వానికి అలవాటుపడిన కాంగ్రెస్ పార్టీకి ఇది జీర్ణించుకోవడం కష్టమే. నెహ్రూ వారసుడు స్వయంగా పార్టీ పగ్గాలను బయటవారికి అప్పగించాలనుకోవడం కాంగ్రెస్‌ చరిత్రలో సంచలనమని చెప్పక తప్పదు. ఈ పెనుమార్పుతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సాధిస్తుందా లేక కొత్త అధ్యక్షుడు సోనియా, రాహుల్ చేతిలో డమ్మీగా మిగిలిపోతారా? అనేది రానున్న రోజులలో తేలిపోతుంది.


Related Post