బాబు వెంటనే ఇల్లు ఖాళీ చేస్తే మంచిది: వైసీపీ

June 26, 2019


img

టిడిపి హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేస్తున్న జగన్ ప్రభుత్వం, దాని తరువాత పక్కనే ఉన్న చంద్రబాబునాయుడు నివాసంపై కూడా దృష్టి పెట్టబోతోందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మాటలతో స్పష్టం అయ్యింది. 

ప్రజావేదిక భవనం కూల్చివేత పనులను చూసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ చంద్రబాబునాయుడు నివాసంతో సహా కృష్ణానదీ తీరంవెంబడి కరకట్టపై 60కు పైగా అక్రమకట్టడాలు నిర్మించబడ్డాయి. ఆనాడు అధికారం చేతిలో ఉండటంతో చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి వాటివైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా చేశారు. కానీ కరకట్టపై నిబందనలకు విరుద్దంగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. కనుక చంద్రబాబుతో సహా అక్రమకట్టడాలలో నివశిస్తున్నవారందరూ వీలైనంత తొందరగా వాటిని ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తే గౌరవంగా ఉంటుంది,” అని అన్నారు.

ప్రజావేదిక కూల్చివేతపై టిడిపి నేతలు ఆందోళనలు చేస్తునప్పటికీ, తమ అక్రమకట్టడాల కూల్చేవేతకు ప్రభుత్వం వెనుకాడబోదని గ్రహించినట్లే ఉన్నారు. చంద్రబాబునాయుడు కూడా వీలైనంత తొందరగా తన నివాసం ఖాళీ చేసేందుకు సిద్దపడుతున్నట్లు తాజా సమాచారం. ఆయన కోసం టిడిపి నేతలు విజయవాడ, గుంటూరులో ఇళ్ళు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేతే ఇళ్ళు ఖాళీ చేయడానికి సిద్దపడుతున్నప్పుడు, మిగిలినవారు కూడా ఖాళీ చేయకతప్పదు. 

అయితే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చివేసినట్లుగా వారి నివాసాలను ఇప్పటికిప్పుడు కూల్చియడం సాధ్యం కాదు కనుక అందరికీ ఇళ్ళు ఖాళీ చేయవలసిందిగా ముందుగా నోటీసులు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ వారు కోర్టులను ఆశ్రయిస్తే న్యాయపోరాటం కూడా చేయవలసి ఉంటుంది. కనుక అంతవరకు టిడిపి-వైసీపీ నేతల మద్య మాటల యుద్దాలు, రాజకీయాలు అనివార్యంగానే కనబడుతున్నాయి.


Related Post