రాహుల్ మనసు మార్చుకున్నారా?

June 26, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనుకున్న రాహుల్ గాంధీ మనసు మార్చుకున్నారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. గురువారం డిల్లీలో జరుగబోయే సమీక్షా సమావేశానికి హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులను హాజరుకావాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రాహుల్ గాంధీ, మళ్ళీ అధ్యక్ష హోదాలో పార్టీ నేతలతో ఎన్నికల సన్నాహల గురించి సమావేశం నిర్వహించాలనుకోవడం చూస్తే ఆయన మనసు మార్చుకొన్నట్లేనని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. 

ఈ ఏడాది చివరిలో ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీని సిద్దం ఎన్నికలకు చేసేందుకు రాహుల్ గాంధీ ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. వాటి తరువాత ఫిబ్రవరిలోగా డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగవలసి ఉంది. కనుక డిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌తో కూడా రాహుల్ గాంధీ శుక్రవారం సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష హోదాలో ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు కనుక ఆయన మనసుమార్చుకొన్నట్లేనని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి నిరాకరిస్తే 130 సం.లకు పైగా చరిత్ర కలిగి దేశవ్యాప్తంగా వేలాదిమంది నేతలున్న కాంగ్రెస్ పార్టీ అయోమయస్థితిలో ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతర రాష్ట్రాలలో, పార్టీలలో కుటుంబపాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ స్వయంగా తప్పుకోవడానికి సిద్దపడినప్పటికీ కుటుంబపాలననే కోరుకొంటుండటం విచిత్రం.


Related Post