కాళేశ్వరంకు ప్రత్యేక కేటగిరీ!

June 21, 2019


img

కొద్దిసేపటి క్రితమే సిఎం కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజి వద్ద పూజాకార్యక్రమాల అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ, మహారాష్ట్ర సిఎంలు జగన్‌మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారందరూ కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాల తరువాత మోటర్లను ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా భారీ మోటర్లు బిగించినందున భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది కనుక ఈ ప్రాజెక్టుకు ‘ప్రత్యేక కేటగిరీ’లో విద్యుత్ సరఫరా చేయాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రస్తుతం 132 కేవి లోపు విద్యుత్ వాడకం ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నిటికీ హెచ్‌టీ–4 (ఏ) కేటగిరీ కింద విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ కేటగిరీలో యూనిట్‌కు రూ.5.80 చొప్పున ఛార్జీలు పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 కేవి లోడ్‌తో విద్యుత్ సరఫరా చేయవలసి ఉంటుంది కనుక దీని కోసం ఇంకా తక్కువ విద్యుత్ ఛార్జీలతో ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయవలసిందిగా సిఎం కేసీఆర్‌ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త కేటగిరీ ఏర్పాటు ప్రతిపాదనను త్వరలో విద్యుత్ నియంత్రణ మండలికి పంపించబోతోంది. దీనిని ఈ ఆర్ధిక సంవత్సరం నుంచే అమలుచేయవలసిందిగా కోరనున్నారు.   

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్ళును ఎత్తిపోస్తారు కనుక 3,800 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవసరం ఉంటుంది. కానీ వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్ళును ఎత్తిపోయడం ప్రారంభిస్తే అప్పుడు అదనంగా మరో 4,992  మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయవలసి ఉంటుందని అధికారులు అంచనా వేసి తదనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటున్నారు.    

కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ప్రకారం ఒక యూనిట్‌కు రూ.3 విద్యుత్ ఛార్జీ ఉంటుందని, దాని ప్రకారం ఏడాదికి రూ.4,067 కోట్లు చెల్లించవలసి ఉంటుందని అధికారులు అంచనావేశారు. ఒకవేళ యూనిట్ ఛార్జీలు రూ.3 కంటే పెరిగితే ఆమేరకు అధనపు భారం భరించక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు 2 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోయాలని అనుకొంటున్నప్పటికీ నీటి లభ్యత ఆధారంగా ఏడాదికి సగటున ఎన్ని టీఎంసీల నీళ్ళు  ఎత్తిపోస్తారనేది వచ్చే వేసవి పూర్తయ్యేనాటికి స్పష్టమవుతుంది. దానిని బట్టి విద్యుత్ వినియోగం, దాని వ్యయంపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.


Related Post