హరీష్‌రావు లేని కాళేశ్వరం!

June 21, 2019


img

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో టిడిపి నుంచి వచ్చి మంత్రిపదవి చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు వంటివారు సైతం చాలా హడావుడి చేస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేసిన మాజీ సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు మాత్రం ఎక్కడా కనబడటం లేదు. తెరాస నేతలు సరే కనీసం మీడియా కూడా ఆయన పేరు, ప్రస్తావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

కాళేశ్వరం పనులు పర్యవేక్షించేందుకు హరీష్‌రావు అనేక రాత్రుళ్ళు ప్రాజెక్టు వద్దే పడుకొన్న రోజులు కూడా ఉన్నాయి. మండుటెండల్లో కార్మికులతో సమానంగా ప్రాజెక్టులో తిరిగిన రోజులున్నాయి. అధికారులతో రేయింబవళ్లు సమావేశాలు నిర్వహించిన రోజులున్నాయి. ప్రాజెక్టు నిధులు, అనుమతుల కోసం డిల్లీ పెద్దల చుట్టూ అనేకసార్లు ప్రదక్షిణాలు చేశారు. ఈ విషయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా దృవీకరించారు కానీ ఇటువంటి ముఖ్యమైన సందర్భంలో తెరాస పెద్దలు ఎవరూ కూడా హరీష్‌రావు పేరును ప్రస్తావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కొత్తగా మంత్రి పదవులు చేపట్టినవారు, అసలు ఇప్పటి వరకు ఏనాడూ కాళేశ్వరం ప్రాజెక్టు చూడనివారు ఇప్పుడు అక్కడ హడావిడిగా తిరుగుతుంటే ప్రజలందరూ హరీష్‌రావు ఏమయ్యారు... ఎక్కడున్నారు? ఈ కార్యక్రమంలో ఆయనకు చోటు లేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సిఎం కేసీఆర్‌ ధృడసంకల్పం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. కానీ ఆయన ఆశయానికి ఆచరణరూపం కల్పించడంలో హరీష్‌రావు చాలా కీలకపాత్ర పోషించిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అటువంటి ముఖ్యమైన వ్యక్తిని, కార్యసాధకుడుని పక్కన పెట్టి నిన్నగాక మొన్న పార్టీలో చేరినవారికి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత కల్పించడం చూసి తెలంగాణ ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో నిర్మించబడుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల గురించి సిఎం కేసీఆర్‌తో సమానంగా అవగాహన, పట్టుదల, కార్యదక్షత, చిత్తశుద్ది కలిగిన వ్యక్తి హరీష్‌రావు అని అందరికీ తెలుసు. గతంలో సిఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల పర్యటనకు వెళ్ళిన ప్రతీసారి పక్కనే హరీష్‌రావు కనిపించేవారు. గత ఆరు నెలలుగా ఆయన కనిపించడం లేదు. తెరాస రెండవసారి అధికారంలోకి రావడంలో చాలా కీలకపాత్ర పోషించిన హరీష్‌రావుకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. అందుకు ఆయన ఏనాడూ ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కాళేశ్వరంతో సహా ఏ ప్రాజెక్టులోకి హరీష్‌రావు అడుగుపెట్టలేని పరిస్థితి ఎదురవడం ఇంకా బాధాకరం. 

సిఎం కేసీఆర్‌ హరీష్‌రావును పక్కన పెట్టారో లేక వేరే ముఖ్యమైనా బాధ్యతలు అప్పగించారో తెలియదు కానీ ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో ప్రజలే కాదు ప్రతిపక్ష నేతలు కూడా ఆయన ఎక్కడున్నారని అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా కేసీఆర్‌ ఆహ్వానించారు. ఆ ప్రాజెక్టుకు రుణాలు మంజూరు చేసిన బ్యాంకర్లను కూడా ఆహ్వానించి వారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రేయింబవళ్లు పనిచేసిన హరీష్‌రావు పేరును ఎవరూ ప్రస్తావించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకంపై హరీష్‌రావు పేరు వేయించారో లేదో తెలియదు. కనీసం ఈ సందర్భంగా ఆయనకు ప్రాజెక్టు వద్ద కొబ్బరికాయ కొట్టేందుకైనా అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. హరీష్‌రావు లేని కాళేశ్వరం ప్రాజెక్టును ఊహించుకోలేము.


Related Post