జమిలి ఎన్నికలకు తెరాస ఓకే!

June 20, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెరాస తరపున ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆ సమావేశంలో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు కలిపి ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహించడంపై లోతుగా చర్చించారు. వామపక్షాలు, మరో రెండు మూడు పార్టీలు  తప్ప దాదాపు అన్ని పార్టీల ప్రతినిధులు ఆ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణలో సాధకబాధకాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. 

సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తుండటం వలన పదేపదే ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, దాని వలన పరిపాలన, అభివృద్ధి కుంటుపడటం, ఎన్నికల వ్యయం పెరగడం వంటి అనేక సమస్యలున్నాయి. కనుక జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఆహ్వానించాము. దీనికోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించాము. దానికి తెరాస మద్దతు ఇస్తుందని తెలిపాము. 

మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలనే ప్రతిపాదనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. ఈ సందర్భంగా ఒక్కో రాష్ట్రంలో 150 గ్రామాలు,150 ప్రభుత్వ పాఠశాలలు,150 ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకరిస్తే బాగుంటుందని సూచించాము. రాష్ట్రాలకు సంబందించిన విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేసి అధికార వికేంద్రీకరణ చేయాలని సూచించాము. మా ప్రతిపాదనలపై ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారు. వాటిపై మంత్రివర్గంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు,” అని కేటీఆర్‌ చెప్పారు. 

గతంలో ప్రధాని నరేంద్రమోడీ జమిలి ప్రతిపాదన చేసినప్పుడు కూడా సిఎం కేసీఆర్‌ స్వాగతించారు కానీ తెరాస రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా అనుమతించారు. ఎన్నికలు లేనప్పుడు ఈవిధంగా జమిలి ఆలోచనలతో కాలక్షేపం చేసి, ఎన్నికలు దగ్గర పడేసరికి ఏవో సాంకేతిక కారణాలతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి అన్ని పార్టీలు తమ తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటం చూస్తూనే ఉన్నాము. కనుక మళ్ళీ ఇదే పునరావృతం కావచ్చు. 


Related Post