కోమటిరెడ్డి సోదరుల భిన్నస్వరాలు!

June 17, 2019


img

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ విషయమై భిన్నవాదనలు వినిపించడం విశేషం. తాను బిజెపిలో చేరుతున్నానంటూ నాలుగు రోజుల క్రితం మీడియాలో వచ్చిన వార్తలపై వెంకట్‌రెడ్డి స్పందిస్తూ, “అవన్నీ పుకార్లే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి దానిని మళ్ళీ బలపరుచుకుంటాము. అందుకోసం అవసరమైతే మేమిరువురం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయడానికి సిద్దంగా ఉన్నాము. అయితే పిసిసి అధ్యక్ష పదవిపై ఇప్పుడు నాకు ఏమాత్రం ఆశ లేదు. వచ్చే ఎన్నికలలో తెరాసను డ్డీకొనబోయేది కాంగ్రెస్ పార్టీయే. గెలిచి అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే,” అని అన్నారు. 

ఆ మరుసటిరోజు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి నల్గొండలో విలేఖరులతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీని ఎవరూ కాపాడలేరు. తెరాసకు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించగల శక్తి బిజెపికి మాత్రమే ఉంది,” అని అన్నారు. 

అంటే బిజెపిలో చేరాలనే ఆలోచన చేయక మునుపు వెంకట్‌రెడ్డి ఆవిధంగా అన్నారా? లేదా నేటికీ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారా? లేక ఇప్పుడు మనసు మార్చుకుని సోదరుడితో సహా బిజెపిలో చేరబోతున్నారా? అనే ప్రశ్నలకు ఒకటి రెండు రోజులలోనే సమాధానాలు లభించవచ్చు. అయితే అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో కొనసాగకపోవచ్చు. ఎందుకంటే, అప్పుడు రాజకీయంగా వారు శత్రువులుగా మారడమే కాకుండా, రాజకీయంగా ఇద్దరూ బలహీనపడతారు.


Related Post