మంత్రివర్గ విస్తరణ ఇంకా ఎప్పుడో?

June 15, 2019


img

రెండువారాల క్రితం ఏపీ సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని తొలి సమావేశం నిర్వహించి, వెంటనే శాసనసభ సమావేశాలు కూడా నిర్వహిస్తుంటే, ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన సిఎం కేసీఆర్‌ మాత్రం ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. ఎన్నికల ఫలితాలు విడుదలై అప్పుడే మూడు వారాలు కావస్తోంది. చివరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయిపోయింది కానీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ ఊసే వినిపించకపోవడంతో తెరాసలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారందరూ తీవ్ర నిరాశతో ఉన్నారు.

సాగునీటిశాఖను సిఎం కేసీఆర్‌ తన వద్దే అట్టేబెట్టుకోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా కీలకపాత్ర పోషించిన మాజీ సాగునీటిశాఖామంత్రి హరీష్‌రావు ప్రమేయం లేకుండానే ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగనుంది. అదేవిధంగా ఆర్ధికశాఖను సిఎం కేసీఆర్‌ తనవద్దే అట్టేబెట్టుకోవడంతో ఈసారి శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెరాసలో చేరిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో కొందరు మంత్రిపదవులకు పోటీగా తయారవడంతో మొదటి నుంచి తెరాసనే నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలు చాలా ఆందోళన చెందుతున్నారు. బహుశః కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కాగానే సిఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ చేయవచ్చునని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. 


Related Post