రాష్ట్రం పరువు తీస్తున్నారేమిటి భట్టిగారు...?

June 15, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభోత్సవం జరుగుతుండటంతో యావత్ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషిస్తుంటే, కాంగ్రెస్‌ నేతలు మాత్రం రాష్ట్రం పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని తెరాస నేత కర్నే ప్రభాకర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని రావద్దని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కోరడాన్ని ప్రభాకర్ తప్పు పట్టారు. గతంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మిషన్ భగీరధ ప్రారంబోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ రావద్దని లేఖ వ్రాశారని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లయితే ఆ నీటిని వాడుకోకుండా ఉంటారా? అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వారి అధిష్టానాన్ని చూసి బుద్ది తెచ్చుకోవాలని అన్ననరు. సోనియా, రాహుల్ ఇరువురూ ప్రధాని నరేంద్రమోడీ రాజకీయంగా వ్యతిరేకిస్తునప్పటికీ, ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వెళ్ళి హుందాతనం ప్రదర్శించారని అన్నారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ప్రజలు ఎన్నిసార్లు కొర్రుకాల్చి వాతలు పెడుతున్నప్పటికీ వారి తీరు మాత్రం మారడం లేదని ప్రభాకర్ అన్నారు. వారు తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 



Related Post