అన్నీ చెప్పుకున్నారు అసలు విషయం తప్ప!

June 14, 2019


img

ఏపీలో టిడిపి ఘోరపరాజయానికి కారణాలను విశ్లేషించుకునేందుకు చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈరోజు టిడిపి నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న నేతలందరూ పార్టీ ఓటమికి తలో కారణం చెప్పారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు ఎవరూ కూడా అసలు కారణాలు చెప్పుకోలేదు. ఒకరు బాబుకి-కార్యకర్తలకు దూరం పెరిగిందని, మరొకరు బాబును అధికారులు తప్పు దోవ పట్టించారంటూ రకరకాల కారణాలు చెప్పుకొని తృప్తి పడ్డారు. అయితే టిడిపి ఓటమికి అనేక ముఖ్య కారణాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. 

1. ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని తదనుగుణంగా నడుచుకోవడంలో చంద్రబాబునాయుడు విఫలమవడం. 

2. రాజధాని నిర్మాణం చేయకుండా కాలక్షేపం చేస్తూ తాత్కాలిక కట్టడాలపై వేలకోట్లు దుబారా చేయడం. 

3. సెంటిమెంటుగా మారిన ప్రత్యేకహోదాపై ప్రజలను చంద్రబాబునాయుడు మోసగించడం. 

4. రాజధాని భూసేకరణ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా కొట్టిపడేయడం.

5. ఎమ్మెల్యేలకు ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం.

6. పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలే తప్ప పరిశ్రమలను రప్పించలేకపోవడం. 

7. ప్రజాప్రతినిధులలో అవినీతి, ప్రజల పట్ల నిర్లక్ష్యధోరణి. 

8. అధికారులు, ప్రభుత్వోద్యోగుల పట్ల ప్రజాప్రతినిధుల నోటి దురుసుతనం.   

వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం:                   

1. ఎటువంటి బలమైన కారణం లేకుండా ప్రధాని నరేంద్రమోడీతో కయ్యనికి కాలు దువ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోవడం.   

2. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం. 

3. జగన్ పట్ల ప్రజలలో పెరుగుతున్న సానుభూతిని గుర్తించడంలో వైఫల్యం. 

4. సిఎం కేసీఆర్‌ వ్యూహాలను సమర్ధంగా ఎదుర్కొలేకపోవడం.

ఈవిధంగా చెప్పుకుంటూ పోతే అనేకానేక కారణాలు కనిపిస్తాయి. కానీ వాటి ప్రస్తావన చేయకుండా ఏవేవో చెప్పుకొని వాటినే ఆత్మవిమర్శ అనుకుంటే నష్టపోయేది టిడిపియే. అధికారంలో ఉన్నప్పుడు అహంభావంతో విర్రవీగితే ఎంతటివారికైనా ఏదో ఒకరోజు ఇదే పరిస్థితి ఎదుర్కోకతప్పదు. 

చివరిగా ఒక మాట: అన్నిటి కంటే విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏపీలో టిడిపి ఓడిపోబోతోందని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్విరాజ్ తో సహా సినిమా నటీనటులు కూడా చాలా ముందుగానే గ్రహించేరు కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గుర్తించలేకపోయారు పాపం! చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొని ఏమి ప్రయోజనం?


Related Post