ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కసరత్తు షురూ

June 14, 2019


img

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించి చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారనిపిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు ఏపీ ప్రజలపై, ఉద్యోగులపై వరాల తొలకరి జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. అలాగే పాదయాత్ర సందర్భంగా వివిద వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా శరవేగంగా అమలుచేస్తున్నారు. వాటిలో ఒకటైన ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఈరోజు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ కమిటీ 4-8 వారాలలోపుగా నివేదిక ఇవ్వవలసి ఉంటుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలతో పాటు, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు, వారికి అదనంగా కల్పించవలసిన సౌకర్యాలు వగైరా, ఆర్టీసీలో ఎలెక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం మొదలైన అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వవలసి ఉంటుంది. 

జగన్ తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినందున, ఈ కమిటీ నివేదిక లాంఛనప్రాయమేనని భావించవచ్చు. కనుక త్వరలోనే ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తధ్యమనే భావించవచ్చు.


Related Post