జగన్ నిర్ణయాలతో కేసీఆర్‌కు తలనొప్పులు

June 14, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ప్రకటిస్తున్న సంక్షేమపధకాలు, వాటిని అన్ని వర్గాలకు నిర్ధిష్ట గడువులోగా వర్తింపు చేస్తాననే ప్రకటనలు, శాసనసభలో నిన్న ఫిరాయింపులపై అన్న మాటలు.... అన్నీ కూడా సిఎం కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి.

ఇప్పటి వరకు కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలే దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉండేవి కానీ ఇప్పుడు జగన్‌ ప్రకటిస్తున్న పధకాలలో కొన్ని వాటినే పోలి ఉన్నప్పటికీ వాటిని మించినట్లుగా ఉండటంతో సహజంగా తెలంగాణలో ప్రతిపక్ష నేతలు వాటితో పోల్చి కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదాహరణకు సిఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పధకం ప్రకటించి ఐదున్నరేళ్లు పూర్తి కావస్తున్న ఇంతవరకు ఆ హామీ అమలుచేయలేదు. కానీ ఆ పధకం స్పూర్తితోనే జగన్‌ ఏపీలో పేదవారికి నిర్ధిష్ట కాలంలో ఇళ్ళ నిర్మాణం చేసేందుకు ప్రణాళిక ప్రకటించారు.

వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన రాష్ట్రంలో అర్హులైన మహిళల పేరిట ఇళ్ల స్థలాలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని, ఆ మరుసటి సం.వాటిలో ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. అంటే రెండేళ్ళ నిర్ధిష్ట కాల వ్యవధిని ముందే ప్రకటించారన్న మాట. అది చూసి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇంకా ఎప్పుడు నిర్మిస్తారని కేసీఆర్‌ను నిలదీస్తున్నారు. 

జగన్‌ నిన్న శాసనసభలో మాట్లాడుతూ , “పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించము. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరాలనుకుంటే ముందుగా వారిచేత వారి పదవులకు రాజీనామాలు చేయించినా తరువాతే పార్టీలో చేర్చుకొంటాము. మా పార్టీలో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేల చేత ముందుగా రాజీనామాలు చేయించే బాధ్యత స్పీకరు గారిదే. ఈ విషయంలో నేను కలుగజేసుకోను,” అని జగన్‌మోహన్‌రెడ్డి నిర్ద్వందంగా చెప్పారు. 

సిపిఐ నేత నారాయణ, కాంగ్రెస్‌ నేతలు మల్లు భట్టివిక్రమార్క, విజయశాంతి, షబ్బీర్ ఆలీ, జీవన్ రెడ్డి తదితరులు జగన్ చెప్పిన ఆ మాటలను ప్రస్తావించి, నీకంటే చిన్న వాడైన జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోమని సిఎం కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. జగన్‌ వైఖరి వలన సిఎం కేసీఆర్‌కు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, జగన్‌తో స్నేహం ఉన్నందున తెరాస నేతలు మౌనంగా ప్రతిపక్ష నేతల దెప్పిపొడుపులను భరించక తప్పడం లేదు. జగన్ ఇప్పుడిప్పుడే తన విధానాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. కనుక మున్ముందు ఇటువంటివి ఇంకా ఎన్ని చేసి చూపిస్తారో? వాటి వలన సిఎం కేసీఆర్‌కు ఎన్ని తలనొప్పులు ఎదుర్కోవలసివస్తుందో ఊహించలేము.



Related Post