తెరాస-బిజెపి ఆధిపత్యపోరు షురూ?

June 06, 2019


img

మొన్న నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో తెరాస, బిజెపి కార్యకర్తల మద్య జరిగిన ఘర్షణలో బిజెపి కార్యకర్త ప్రేమ్ కుమార్‌ హత్యకు గురయ్యాడు. ఆ ఘటనపై రాష్ట్ర బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ నిన్న నాగర్ కర్నూల్‌ జిల్లాలో బిజినేపల్లి మండలంలోని మహాదేవునిపేటలో తెరాస-బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకొన్నారు. వాటిలో ఒక బిజెపి మహిళా కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి, బిజెపి కార్యకర్తను ఆసుపత్రికి తరలించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. బిజెపి కార్యకర్తలపై భౌతికదాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. 

గతంలో కాంగ్రెస్‌-తెరాసల మద్య ఆధిపత్యపోరు నెలకొని ఉన్నందున ఆ రెండు పార్టీల కార్యకర్తల మద్య ఇటువంటి ఘర్షణలు జరుగుతుండేవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొన్న బిజెపి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. కనుక ఇప్పుడు తెరాస-బిజెపిల మద్య ఆధిపత్యపోరు మొదలైనట్లు కనిపిస్తోంది. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా బిజెపి బలపడాలని ప్రయత్నిస్తోంది. కనుక అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌-బిజెపికి మద్య ఆధిపత్యపోరు మొదలవడంతో అక్కడా ఇరుపార్టీల కార్యకర్తల మద్య ఇటువంటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీల మద్య జరుగుతున్న ఈ ఆధిపత్యపోరులో ఆ మూడు పార్టీలలో అగ్రనేతలు హాయిగా, సుఖంగా జీవిస్తుంటే క్రిందిస్థాయిలో కార్యకర్తలు గొడవలుపడుతూ ప్రాణాలుకోల్పోతుండటం చాలా బాధాకరం.


Related Post