జగన్ దృష్టిలో పడ్డారు...ప్రాణాలు నిలిచాయి

June 05, 2019


img

ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మూడు రోజులలోనే జగన్‌మోహన్‌రెడ్డిలో చాలా మార్పు కనబడుతోంది. ఎంతగా అంటే...గత పదేళ్ళుగా చూసిన జగన్‌...ఇప్పుడు చూస్తున్న జగన్ ఒకరేనా కాదా అనే అంతగా! ఇంతకు ముందు ఎప్పుడూ చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూ తీవ్ర ఆవేశంతో కనిపిస్తుండే జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా, ఎప్పుడూ చిర్నవ్వుతో కనిపిస్తున్నారు. ఇంకా మంత్రివర్గం ఏర్పాటు చేసుకోక మునుపే చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా నిన్న విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన ఒక ఘటన ఆయనకు జనాలు జేజేలు పలికేలా చేసింది.     

మంగళవారం విశాఖలోని శ్రీ శారదా పీఠాన్ని దర్శించుకొని విమానాశ్రయానికి తిరిగివెళుతున్నప్పుడు దారిలో ఒకచోట రోడ్డు పక్కన బారికేడ్లకు అవతల కొందరు విద్యార్దులు, “మా స్నేహితుడి ప్రాణాలను కాపాడండి,” అంటూ వ్రాసున్న ఒక బ్యానర్ పట్టుకొని నిలబడున్నారు. రివ్వున దూసుకుపోతున్న జగన్ కాన్వాయ్ వారిని దాటుకొని ముందుకు వెళ్లిపోతుంటే కారులో కూర్చోన్న జగన్‌ ఆ బ్యానర్‌ను చూసి తన కారుని ఆపించి, కారు దిగి బ్యారికేడ్ల అవతల ఉన్న ఆ విద్యార్దులను తన వద్దకు రప్పించుకొని వారితో ఆప్యాయంగా మాట్లాడి విషయం అడిగి తెలుసుకొన్నారు. 

తమ స్నేహితుడు నీరజ్ కుమార్ బ్లడ్ కేన్సర్ వ్యాధికి గురయ్యాడని, అతని ఆపరేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని, కానీ పేద కుటుంబానికి చెందిన తమ స్నేహితుడు వైద్యం చేయించుకోలేక బాధతో విలవిలలాడుతున్నాడని అతనిని ఎలా బ్రతికించుకోవాలో తెలియక ఈవిధంగా మీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించామని చెప్పారు. అతనిని ఆదుకోవలసిందిగా వారు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. 

చాలా ఓపికగా వారు చెప్పిందంతా విన్న తరువాత ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి “మీ స్నేహితుడిని కాపాడే బాధ్యత నాది. అతని వ్యాధి పూర్తిగా నయమయ్యేవరకు చికిత్స చేయిస్తాను. అతను మళ్ళీ మీతో సరదాగా సంతోషంగా గడుపుతాడు,” అని ధైర్యం చెప్పి, నీరజ్ కుమార్‌ చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే చేయాలని తన కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని ఆదేశించారు. అంతేకాదు...ఆ విద్యార్దులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి అవసరమైతే నేరుగా తనకు ఫోన్ చేయాలని కోరారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ వెంటనే సబందిత ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి నీరజ్ కుమార్‌ ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందన ఔదార్యం చూసి ఆ విద్యార్దులతో సహా అక్కడున్న ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలికారు.


Related Post