భూకబ్జాల లాగే మీడియాను కబ్జా చేస్తున్నారు: రవి ప్రకాష్

June 05, 2019


img

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ ఈరోజు హైదరాబాద్‌ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరైన మీడియాతో మాట్లాడుతూ, “పేదరైతులను బెదిరించి, భయపెట్టి దొంగపత్రాలతో వారి భూములను ఏవిధంగా ఆక్రమించుకొంటారో అదేవిధంగా రాష్ట్రంలో మీడియాను కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా మిత్రులు కొందరు కలిసి మోజో టీవీని నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కొందరు పోలీస్ అధికారుల అండదండలతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి ఒక్క రూపాయి చెల్లించకుండా ఆ ఛానల్ ను బలవంతంగా లాక్కొన్నారు. ఇటువంటి చవుకబారు ప్రయత్నాలను గట్టిగా నిలదీయడానికి జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసికట్టుగా పోరాడాలి. మీడియాను కబ్జా చేసేందుకు జరుగుతున్న  ఇటువంటి ప్రయత్నాలపై ప్రజలు కూడ తమ గళం విప్పాలి,” అని అన్నారు. 

కొందరు వ్యక్తులు టీవీ9 న్యూస్ ఛానల్లోకి దొడ్డిదారిలో ప్రవేశించి తనను బైటికి పంపించారని రవిప్రకాశ్‌ కొన్నిరోజుల క్రితం ఆరోపించారు. ఆ తరువాత ఆయన చెప్పినట్లుగానే మోజో టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ రేవంతి కొందరు వ్యక్తులు మోజో టీవీలో తన వాటాలను తమకు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తమ ఛానల్ కార్యాలయం ముందే నిరాహార దీక్షకు దిగారు. కనుక మీడియాను తమ చెప్పు చేతలలో తీసుకొనేందుకు  తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే రవి ప్రకాష్ వాదనలో ఎంతో కొంత నిజముందని స్పష్టమవుతోంది. అయితే మీడియా సంస్థల మద్య కూడా ఆధిపత్యపోరు సాగుతున్నందున ఎవరూ పట్టించుకోవడం లేదు. 


Related Post