ఇది అసాధారణమైన విజయం...కానీ పొంగిపోము: కేటీఆర్‌

June 05, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కంగుతిన్న తెరాస, వెనువెంటనే జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించడంతో తేరుకొంది. 

ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “దేశచరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ పీఠాలను తెరాస గెలుచుకొంది. లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు కాస్త భిన్నంగా ఎందుకు ఆలోచించారో తెలియదు కానీ ఈ ఎన్నికలలో మాత్రం ఏకపక్షంగా మా పార్టీకే ఓట్లు వేసి గెలిపించారు. పరిషత్ ఎన్నికలలో ఘనవిజయం మాకు చాలా సంతోషమే కానీ అది చూసి ఉప్పొంగిపోము. ఈ గెలుపుతో ప్రజలు మాపై మరింత నమ్మకం పెంచుకొన్నారని స్పష్టమయింది కనుక మరింత కష్టపడి పనిచేస్తాము. లోక్‌సభ ఎన్నికలలో 16 ఎంపీ సీట్లు గెలుచుకొంటామని మేము భావించాము కానీ ప్రజలు నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని కావాలనుకొంటునారో ఏమో...మాకు కొన్ని సీట్లు తగ్గాయి. లోక్‌సభ ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా విశ్లేషించుకొని ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దుకొంటాము,” అని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో నలుగురు బిజెపి అభ్యర్ధులు గెలుపును ప్రధాని నరేంద్రమోడీతో ముడిపెట్టి చెప్పారు బాగానే ఉంది కానీ కాంగ్రెస్‌ పార్టీ కూడా 3 ఎంపీ సీట్లు గెలుచుకొంది. చేవెళ్ళలో తృటిలో విజయం చేజారిపోయింది లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా 4 ఎంపీ సీట్లు గెలుచుకొని ఉండేది. ప్రజలు మోడీని కోరుకొంటున్నట్లయితే మరి ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకు కేటీఆర్‌ ఏమని సమాధానం చెపుతారు? ముఖ్యంగా నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో 65,000కు పైగా ఓట్ల తేడాతో కవిత ఘోరపరాజయానికి మోడీయే కారణమని భావిస్తున్నారా లేక స్వయంకృతాపరాదమా? కేటీఆర్‌ చెపితే బాగుంటుంది. 

పరిషత్ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించినప్పటికీ, ఒక్కో ఎన్నికలలో ప్రజాతీర్పు ఒక్కోవిధంగా ఉండటాన్ని  తెరాస హెచ్చరికగానే భావించి లోపాలున్నట్లయితే సవరించుకొంటే మంచిది.


Related Post