జూన్ 8న ఏపీ..మరి తెలంగాణ మంత్రివర్గం?

June 04, 2019


img

మే 30న ప్రమాణస్వీకారం చేసిన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీన తన మంత్రివర్గం ఏర్పాటుచేసుకోబోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్నా సిఎం కేసీఆర్‌ ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు కనుక త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా అన్ని ఎన్నికలు పూర్తయినందున త్వరలోనే సిఎం కేసీఆర్‌ మంత్రివర్గం విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రస్తుతం మంత్రివర్గంలో సిఎం కేసీఆర్‌తో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు కనుక మరొక ఆరుగురికి మంత్రివర్గంలో తీసుకోవచ్చును. వాటిలో రెండు స్థానాలు మహిళలకు ఇస్తామని కేసీఆర్‌ ముందే చెప్పారు కనుక మిగిలిన నాలుగు స్థానాలలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్‌, హరీష్‌రావులను మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవడం దాదాపు ఖాయమనే అందరూ భావిస్తున్నారు. కనుక మరో ఇద్దరికి అవకాశం ఉంది. కానీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్‌, కరీంనగర్‌లో తెరాస సిట్టింగ్ ఎంపీలు కవిత, వినోద్ ఓడిపోయినందున, వారి ఓటమికి కారణమని భావిస్తున్న ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు సిఎం కేసీఆర్‌ ఉద్వాసన పలికి వారి స్థానంలో కవితతో సహా ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Related Post