గవర్నర్‌ను మార్చాలి: హనుమంతన్న డిమాండ్

June 03, 2019


img

గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారిలో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు ఒకరు. గవర్నర్‌ నరసింహన్‌కు ఎంతసేపు గుళ్ళూ గోపురాల చుట్టూ తిరగడం తప్ప రాష్ట్ర సమస్యలపట్ల ఆసక్తి చూపరని హనుమంతన్న వాదన. 

ఇటీవల ఇంటర్మీడియట్‌ ఫలితాలలో ఏర్పడిన గందరగోళం కారణంగా రాష్ట్రంలో 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నా, హాజీపూర్‌లో బాలికలు వరుస హత్యలకు గురైనప్పుడు కాంగ్రెస్‌ నేతలు వాటిని ఆయన దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గుళ్ళూ గోపురాలు తిరుగుతుండే గవర్నర్‌ నరసింహన్‌ను కేంద్రప్రభుత్వం తక్షణం తొలగించి ఆయన స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. త్వరలోనే తాను డిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరుతానని మీడియాతో అన్నారు. 

డిసెంబర్ 2009లో యూపీయే హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి నరసింహన్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2014 ఎన్నికలలో గెలిచి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, విభజన సమస్యల పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉన్నందున ఆయననే రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగించింది. 

ఇటీవల ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య మంచి సఖ్యత ఏర్పడింది కనుక గవర్నర్‌ నరసింహన్‌ చొరవతో విభజన సమస్యలు ఒకటొకటిగా పరిష్కారం అవుతున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌కు మాటను ఇరువురూ గౌరవిస్తూ సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకొంటున్నందున కేంద్రప్రభుత్వం ఆయననే మరికొంత కాలం కొనసాగించవచ్చు. 

కానీ ఒకవేళ తెలంగాణలో బిజెపి బలపడాలని నిశ్చయించుకొంటే ఆయన స్థానంలో తమకు అనుకూలమైన వ్యక్తిని గవర్నర్‌గా నియమించుకోవచ్చు. అనారోగ్యకారణాల చేత కేంద్రమంత్రివర్గంలో చేరలేకపోయిన సుష్మాస్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ లను గవర్నర్లుగా నియమించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక గవర్నర్ మార్పు గురించి త్వరలోనే స్పష్టత రావచ్చు. 


Related Post