తెలంగాణ అభివృద్ధిపై రెండురకాల వాదనలు

June 03, 2019


img

జూన్2న తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మూడు ప్రధానపార్టీలు తెరాస, కాంగ్రెస్‌, బిజెపిలు భిన్నమైన వాదనలు వినిపించాయి. తెరాస ప్రభుత్వ పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధిపధంలో దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం కేసీఆర్‌ చెప్పుకోగా, ధనిక రాష్ట్రంగా చేతికి అందిన తెలంగాణను కేసీఆర్‌ తన 5 ఏళ్ళ పాలనలో 2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని కాంగ్రెస్‌, బిజెపిలు వాదించాయి. 

మైనార్టీలకు, బలహీన వర్గాలకు గురుకుల పాఠశాలలను ప్రారంభించి రాష్ట్రంలో విద్యావ్యవస్థను చాలా బలోపేతం చేసి సత్ఫలితాలను సాధిస్తున్నామని సిఎం కేసీఆర్‌ చెప్పగా, గత 5 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పరీక్షను సక్రమంగా సమర్ధంగా నిర్వహించలేకపోయిందని, అందుకు ఇంటర్ బోర్డు ఫలితాలే తాజా ఉదాహరణ అని కాంగ్రెస్‌, బిజెపిల వాదించాయి. 

తమ ప్రభుత్వం చాలా చురుకుగా, చాలా పారదర్శకంగా పరిపాలన సాగిస్తోందని సిఎం కేసీఆర్‌ చెపుతుంటే, రాష్ట్రంలో అప్రజాస్వామిక, నిరంకుశ కుటుంబ పాలన సాగుతోందని కాంగ్రెస్‌, బిజెపిలు వాదన. 

తమ ప్రభుత్వం అనేకానేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం కేసీఆర్‌ చెప్పగా, ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన కేసీఆర్‌ 5 ఏళ్ళలో రాష్ట్రంలో కనీసం లక్షమందికి ఉద్యోగాలు కల్పించలేకపోయారని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి వంటి హామీలను ఇంకా ఎప్పటికీ అమలుచేస్తారో తెలియడం లేదని ఆ రెండు పార్టీలు వాదించాయి. 

గత 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందనేది ఎంత వాస్తవమో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా అంతే నిజమని అందరికీ తెలుసు. అయితే కేసీఆర్‌ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాల వలన  ప్రత్యర్ది పార్టీలకే తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదు కనుక వారు రాష్ట్రాభివృద్ధి పట్ల సంతృప్తిగానే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతులకు కట్టుబడి ముందుకు సాగుతున్నట్లయితే ప్రజలు కూడా హర్షించేవారు.


Related Post