జగన్ దూకుడు ఎక్కువైందా?

June 01, 2019


img

జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టగానే పించనులు రెట్టింపు చేశారు. కిడ్నీ రోగులకు రూ.3,500గా ఉన్న పించనును రూ.10,000 పెంచారు. మధ్యాహ్న భోజన పదకం వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచారు. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీలోగా నెలకు రూ.5,000 గౌరవ వేతనంతో రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామవాలంటీర్లను నియమించబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీలోగా గ్రామసచివాలయాలు ఏర్పాటుచేసి ప్రతీ సచివాలయానికి 10మంది ప్రభుత్వోద్యోగులు చొప్పున 1.60 లక్షల మందిని కొత్తగా నియమించబోతున్నట్లు ప్రకటించారు. 

త్వరలో రాష్ట్రాన్ని ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చొప్పున 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వ ఖజానాపై అమాంతం భారం పెంచేసేవేనని వేరే చెప్పనవసరం లేదు. 

మరోపక్క రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా నిలిచే మద్యం అమ్మకాలను నియంత్రిస్తూ అంచెలంచెలుగా రాష్ట్రంలో మద్యపాన నిషేదం హామీని అమలుచేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అంటే ఖర్చులు పెంచుకొని ఆదాయం తగ్గించుకోవడానికి జగన్ సిద్దపడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇంకా మంత్రివర్గం ఏర్పాటు చేసుకోక ముందే... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులలోనే జగన్‌మోహన్‌రెడ్డి ఇన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికపరిస్థితిలో ఏమాత్రం మెరుగుపడలేదు పైగా నానాటికీ అప్పులు పెరిగిపోయాయి. అందుకే ప్రతీనెల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లవలసి వస్తోంది.

తెలంగాణ ధనిక రాష్ట్రం...దానికి హైదరాబాద్‌ వంటి అక్షయపాత్ర ఉంది కనుక సిఎం కేసీఆర్‌ ఎన్ని సంక్షేమ పధకాలనైనా ప్రవేశపెట్టి అమలుచేయగలుగుతున్నారు. అయినప్పటికీ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి చెల్లింపులు, పంట రుణాల మాఫీ వంటి హామీల అమలులో చాలా ఆచితూచి అడుగు ముందుకు వేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.  

ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంటే అప్పులలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏవిధంగా ఈ అదనపు ఆర్ధిక భారాన్ని భరించగలదు? సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏవిధంగా పెరిగిన ఈ ఖర్చులకు నిధులు సమకూర్చుకొంటారు? అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. 


Related Post