తెరాస పతనం...కాంగ్రెస్‌ పగటి కలలు

June 01, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో తెరాసలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలనుకొన్నప్పుడే తెరాస పతనం ప్రారంభం అయ్యింది. కేసీఆర్‌ నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడలకు వ్యతిరేకంగానే ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. సిఎం కేసీఆర్‌ను గద్దె దించేవరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది,” అని అన్నారు. 

రాష్ట్రంలో తెరాసకు ఎదురే ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అప్రజాస్వామిక వైఖరిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నప్పటికీ తెరాస అధికారంలో ఉన్నందున ప్రతిపక్షాల రోదన అరణ్యరోదనగా మిగిలిపోతోంది. కారణాలు ఏవైతేనేమీ, ప్రజలు కూడా అప్రజాస్వామిక విధానాలను ఆమోదిస్తున్నారు కనుక కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్లు సాగుతోంది. 

ఇక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలుచుకోగానే తెరాస పతనం ఆరంభమైందనే భ్రమలో ఉంటే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే, ప్రస్తుతం జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారినందున మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచే ఫిరాయింపులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బిజెపి మరోపక్క తెరాస కాంగ్రెస్‌ పార్టీని చీల్చుకుపోతే మొదట పతనమయ్యేది కాంగ్రెస్ పార్టీయే తప్ప తెరాస కాదు. కనుక కాంగ్రెస్‌ నేతలు ఇకనైనా తెరాసను గద్దె దించాలనే భ్రమలో నుంచి మేల్కొని ముందు తమ పార్టీని కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తే మంచిది.


Related Post