తెలంగాణలో ఆపరేషన్ కమల్ షురూ?

June 01, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావడం, తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడం, సికిందరాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నియమింపబడటంతో రాష్ట్ర బిజెపి నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొంటూ తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగి, వచ్చే ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడమే తమ లక్ష్యమని కె. లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ వంటి సీనియర్ నేతలు పదేపదే చెపుతున్నారు. అప్పుడే ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే ఉన్నారు.

ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయిన తెలుగుదేశంపై వారు మొదట దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో టిటిడిపి సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి డిల్లీలో బిజెపి ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్‌ను కలిశారు. బిజెపిలో చేరేందుకే వారు రామ్ మాధవ్‌ను కలిసినట్లు స్పష్టం అవుతున్నప్పటికీ, వారు ఆ ఊహాగానాలను ఖండించారు. బిజెపి ఘనవిజయం సాధించి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా అభినందించేందుకే తాము రామ్ మాధవ్‌ను కలిశామని తెలిపారు. 

వారి అధినేత చంద్రబాబునాయుడు బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని శత్రువులుగా భావిస్తుంటే, వారు రామ్ మాధవ్‌ను అభినందించడానికి వెళ్ళడం అంటే బిజెపిలో చేరేందుకు సిద్దపడినట్లే కదా?

(ఫోటో: ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)


Related Post