అతివిశ్వాసమే కొంప ముంచింది: వినోద్

May 31, 2019


img

కరీంనగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ శుక్రవారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఈసారి లోక్‌సభ ఎన్నికలలో స్థానిక సమస్యలు, సంక్షేమ పధకాలు, రాష్ట్రాభివృద్ధి వంటి అంశాల కంటే పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై బిజెపి చేసిన ప్రచారమే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకొంది. దాంతో కొత్తగా ఓటు హక్కువచ్చిన వారిలో 90 శాతం మంది యువత బిజెపి వైపు ఆకర్షితులయ్యారు. అదీగాక ఈ ఎన్నికలలో మేమే తప్పకుండా గెలుస్తామనే అతివిశ్వాసం వలన కూడా మేము చాలా నష్టపోయాము. కరీంనగర్‌లో నా ఓటమికి మరికొన్ని లోపాలు, కారణాలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ బహిరంగంగా చర్చించలేము కనుక పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని ఆ లోపాలను సరిదిద్దుకొంటాము. ఏది ఏమైనప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. నేను ఆశలు నెరవేర్చుకోవడం కోసం కాదు... కొన్ని ఆశయాల సాధనకే రాజకీయాలలోకి వచ్చాను. కనుక ఓడిపోయినప్పటికీ కరీంనగర్‌ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను,” అని అన్నారు. 

రాజకీయాలలో గెలుపోటములు సహజమే కానీ అధికారంలో ఉన్నప్పుడు ‘ప్రజలందరూ మనవైపే ఉన్నారనే’ భ్రమలో ఉండటమే అతి విశ్వాసంగా చెప్పుకోవచ్చు. తమ ఓటమికి ఏవో కుంటిసాకులు చెప్పుకొని సమర్ధించుకొన్నప్పటికీ ఓటమి వారికి ఒక గుణపాఠం వంటిదేనని చెప్పవచ్చు. 

ఎన్నికలలో ధనం, అధికారం, ప్రలోభాలు ఎంతగా ప్రభావం చూపినప్పటికీ ప్రజలు అభ్యర్ధుల ప్రవర్తన, పనితీరు, ప్రజాసంబంధాల ఆధారంగానే ఓట్లు వేస్తుంటారు. కానీ తెరాస మాత్రం మా అభ్యర్ధులకు బదులు మా పార్టీని మానాయకుడి చూసి ఓట్లేయమని ప్రజలను అడిగింది. ‘కారు.. సారు..పదహారు..డిల్లీ సర్కార్...’అర్ధం అదే కదా? ఈ నినాదం వినడానికి చెవులకు ఇంపుగానే ఉంది కానీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు విలువలేదన్నట్లు స్వయంగా చాటుకొన్నట్లయింది. 

అదీగాక ‘సారు...డిల్లీ సర్కారు...’ అన్నప్పుడు ప్రజలు తప్పకుండా కేసీఆర్‌-నరేంద్రమోడీలను పోల్చి చూసుకొని వారిరువురిలో ఎవరికి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూసి వారినే ఎంచుకొనేలా చేసిందని చెప్పవచ్చు.


Related Post