కెసిఆర్ కేంద్రమంత్రి పదవి చేపడితే...

February 27, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న కరీంనగర్ లో జరిగిన తెలంగాణా రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, గత యూపియే, ప్రస్తుత ఎన్డీయే సర్కార్లు దేశంలో వ్యవసాయరంగాన్ని, రైతు సమస్యలను పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పుష్కలంగా జలవనరులు ఉన్నప్పటికీ వాటిని సమర్ధంగా వినియోగించుకోవడంలో తీవ్ర అశ్రద్ద చూపుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగంపట్ల సమగ్రమైన అవగాహన, ప్రణాళిక ఏవీ లేకుండా ముందుకు సాగుతూ దేశంలో సమస్యలను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తాను ప్రధాని నరేంద్ర మోడీతో సహా సంబంధిత కేంద్రమంత్రులు, అధికారులకు ఎన్ని సలహాలు, సూచనలు ఇచ్చినా ఎవరూ పట్టించుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతుల సహనం నశిస్తే వారు తిరుగుబాటు చేయడం తధ్యమని హెచ్చరించారు.

రైతు సమస్యలు, వ్యవసాయం, సాగునీటి రంగాలపై కెసిఆర్ కున్న మక్కువ, పట్టు, అవగాహన తిరుగులేదని అందరికీ తెలుసు. కనుక వాటిపై ఆయన కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు సహేతుకమైనవే అయ్యుండవచ్చు. ఆ రంగాలపై కేంద్రం నిర్లక్ష్యవైఖరికి ఆయన అసంతృప్తి, ఆగ్రహం చెందడం కూడా సహజమే. 

తెలంగాణా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు సాగుతున్నాయి. వ్యవసాయరంగానికి తద్వారా రైతులకు మేలు కలిగించే అనేక నిర్ణయాలు, సంస్కరణలు, ప్రాజెక్టులు, పధకాలు ఒక ఉద్యమస్థాయిలో చేపడుతోంది తెరాస సర్కార్. గత ఏడు దశాబ్దాల కాలంలోనే పూర్తికావలసిన వీటన్నటినీ ఈ మూడున్నరేళ్ళలో చేసి చూపిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులను కేంద్రప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు నిశితంగా గమనిస్తూనే ఉన్నాయి. తరచూ ప్రశంసిస్తూనే ఉన్నాయి. కానీ వాటి స్పూర్తితో అటువంటి మహత్తర ప్రాజెక్టులను మొదలుపెట్టాలనే ఆలోచన కూడా చేయలేదు. కనుక దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు వారికి ఏవో మాయమాటలు చెప్పి ప్రసన్నం చేసుకొంటే సరిపోతుంది అనుకోవడమే తప్ప సమగ్ర వ్యవసాయ, సాగునీటి ప్రణాళికలు రూపొందించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆలోచించడం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల సారాంశంగా భావించవచ్చు. 

అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ రెండు రంగాలలో అవసరమైన మార్పులు, సంస్కరణలు చేయించడం అంత సులువైన పని కాదని అందరికీ తెలుసు. కనుక రాష్ట్రాన్ని చక్కదిద్దిన తరువాత కెసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించి కేంద్ర వ్యవసాయ, జలవనరుల శాఖల బాధ్యతలను తీసుకొని దేశంలో ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తే మంచిది. వచ్చే ఎన్నికలలో భాజపాతో తెరాస పొత్తులు పెట్టుకొంటే, కెసిఆర్ కేంద్రమంత్రి పదవి సంపాదించుకోవడం పెద్ద కష్టమైనా పనేమీ కాదని అందరికీ తెలుసు. కేంద్రాన్ని నిందిస్తూ కూర్చొనేకంటే స్వయంగా ఆ బాధ్యతలు భుజానికెత్తుకొని వాటిని పరిష్కరించి చూపిస్తే దేశానికి ఎంతో మేలు చేసినవారవుతారు. తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తారు కదా! 


Related Post