కేంద్ర బడ్జెట్ లో ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకి మొక్కుబడిగా నిధులు విదిలించడంతో ప్రజలు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరాస ఇంకా స్పందించలేదు కానీ భాజపాకు మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉన్న (ఏపి) తెదేపా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో విశేషమేమిటంటే, ఇటువంటి సందర్భాలలో అందరి కంటే ముందుగా స్పందించే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఏపిలో తెదేపా-భాజపాల మద్య దూరం పెరుగుతుండటం, భాజపా-వైకాపాలు దగ్గరవుతునందునే స్పందనలలో తేడా వచ్చినట్లుంది.
మోడీ సర్కార్ కు ఇదే ఆఖరి బడ్జెట్ కావడం, దానిలో ఏపికి కేటాయింపులు లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నారని, ఒకటి రెండు రోజులలో ‘ఏదో నిర్ణయం’ తీసుకోబోతున్నారని అప్పుడే మీడియాకు లీకులు వచ్చేసాయి. కానీ గతంలో కూడా ఇటువంటి సందర్భాలలో తెదేపా ఇదేవిధంగా వ్యవహరించిందనే సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కనుక ప్రజాగ్రహం నుంచి తాము తప్పించుకొని, దానిని కేంద్రం మీదకు, తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న భాజపాపై పైకి మళ్ళించడానికే తెదేపా ఈ ‘ఆగ్రహం’ డ్రామా ఆడుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా నాలుగేళ్ళు పూర్తికావస్తున్నా రాష్ట్రం పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుంది కనుక తెదేపా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగడం సహజం. ఆ సంగతి చంద్రబాబు నాయుడుకు కూడా బాగానే తెలుసు. కనుక ఈ వైఫల్యానికి కారణం తాము కాదని, కేంద్రమే కారణమని ప్రజలకు గట్టిగా చెప్పుకొని ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా లభించిందని చెప్పవచ్చు. ఒకవేళ ప్రజలను నమ్మించగలిగితే వచ్చే ఎన్నికలలో (భాజపాను వదిలించుకొని) మళ్ళీ ఏదోవిధంగా అధికారం నిలబెట్టుకోవచ్చునని తెదేపా అధినేత ఆలోచనకావచ్చు. లేదా బడ్జెట్ సెగలు చల్లారేవరకు ఈ ‘ఆగ్రహావేశాల ప్రదర్శన’ అవసరమని భావించి ఉండవచ్చు.
ఇక నిన్న మొన్నటి వరకు తెరాసకు తామే ప్రత్యామ్నాయమని పగటి కలలు కన్న భాజపా నేతలకు ఇప్పుడు నోరు విప్పలేని పరిస్థితి కల్పించింది ఈ బడ్జెట్. ఇదే కారణం చేత తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలు కేంద్రంపై చెలరేగిపోయినా ఆశ్చర్యం లేదు.