నేను కూడా రెడీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

February 01, 2018


img

“వచ్చే ఎన్నికలలో తెరాసఏ ఖచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ ఓడిపోయితే నేను రాజకీయ సన్యాసం తీసుకొంటాను. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకొంటుందని చెప్పుకొంటున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దమేనా?” అని రాష్ట్ర ఐటిశాఖా మంత్రి కేటిఆర్ నిన్న సవాలు విసిరారు. 

ఊహించినట్లుగానే దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతే ధీటుగా స్పందించారు. “కేటిఆర్ సవాలును నేను స్వీకరిస్తున్నాను. వచ్చే ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేనే కాదు...నా కుటుంబంలో అందరూ రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకొంటాము. ఇందుకు కెసిఆర్ కుటుంబ సభ్యులు కూడా సిద్దమేనా? తెలంగాణాలో నిశబ్ద విప్లవం మొదలైంది. అది వచ్చే ఎన్నికలలో తెరాసను ఉప్పెనలా ముంచేయబోతోంది,” అని అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం గీయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిజ్ఞ కోసం కాకపోయినా పిసిసి అధ్యక్షుడిగా తన పార్టీని గెలిపించుకోవడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు అండగా నిలబడటంతో టి-కాంగ్రెస్ లో ఆయనను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు సైతం ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ నేతలందరూ ఎన్నికల వరకు ఇదే ఐకమత్యం, పోరాటస్ఫూర్తిని కొనసాగించగలిగితే, వచ్చే ఎన్నికలలో వారు తెరాసకు తప్పకుండా గట్టి సవాలు విసరడం ఖాయం. 

ఈ సవాలు విసరడం ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని దానికి ‘కమిట్’ చేయించగలిగామని తెరాస భావించవచ్చు కానీ దాని వలన అధికారంలో లేని ప్రతిపక్షనేతకు జరిగే నష్టం కంటే అధికారంలో ఉన్న వ్యక్తులకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కేటిఆర్ విసిరిన సవాలును ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించడమే కాకుండా ఈ వ్యవహరంలోకి కెసిఆర్ కుటుంబ సభ్యులందరినీ లాగే ప్రయత్నం చేయడమే అందుకు చక్కటి ఉదాహరణ. అందుకే సాధారణంగా ప్రతిపక్షాలవారే అధికార పార్టీ నేతలకు ఇటువంటి సవాళ్ళు విసురుతుండటం చూడవచ్చు. కనుక అధికారంలో ఉన్నవారు ఇటువంటి ‘రాజకీయ సన్యాసం’ సవాళ్ళకు దూరంగా ఉండటమే మంచిది. 


Related Post