మన తెలుగు సినిమాలలో ఆనాటి నుంచి నేటి వరకు విడుదలైనవాటిలో అత్యధిక శాతం ఓ డజను ఫార్ములాలతోనే నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలకే కాదు...ఆ మూస ఫార్ములా సినీ పరిశ్రమలో ఉన్నవారి జీవితాలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. సినీ పరిశ్రమలో ఏ కొద్దిమందివో తప్ప చాలా మంది జీవితాలు అస్తవ్యస్తంగానే సాగుతుంటాయని నిరూపిస్తూ మరో యువహీరో వైవాహిక జీవితం చిద్రం అయ్యింది. అతనే సామ్రాట్ రెడ్డి.
సామ్రాట్ రెడ్డి భార్య పేరు హర్షితారెడ్డి. వారిరువురికి నవంబర్ 2015లో వివాహం జరిగింది. పెళ్ళైన ఆరు నెలలకే వారి మద్య మనస్పర్ధలు మొదలయింది. సరిగ్గా రెండేళ్ళు గడిచేసరికి అంటే 2017 నవంబర్ లో ఆమె పోలీస్ స్టేషన్ గడప ఎక్కారు. తన భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని హర్షితారెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ లోని (నెక్టార్ గార్డెన్) తమ నివాసంలో తన తల్లితో కలిసి ఉంటోంది. సామ్రాట్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత మళ్ళీ ఇరు కుటుంబాల మద్య కొన్ని గొడవలు జరిగాయి. సంక్రాంతి పండుగకు ఆమె తన తల్లితో కలిసి పుట్టింటికి వెళ్ళినప్పుడు సామ్రాట్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకుపోయాడని హర్షితారెడ్డి నిన్న మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు మళ్ళీ అతనిపై సెక్షన్స్ 448,427,380 ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే తన ఇంట్లో తన వస్తువులను తీసుకువెళితే దొంగతనం చేశానని భార్య పిర్యాదు చేయడం ఏమిటి? ఆమె పిర్యాదు చేస్తే పోలీసులు తనపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏమిటి? అని సామ్రాట్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. హర్షితారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనను జైలుపాలు చేశాడని ఆరోపిస్తున్నాడు. తను మత్తుమందులకు బానిస అయినట్లు వారు చేస్తున్న ఆరోపణలు కూడా అబద్దమని, వారు తన జీవితంతో ఆటలాడుకొంటున్నారని సామ్రాట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ భార్యాభర్తల కాపురంలో కలతలకు అసలు కారణం ఏమిటనేది వారికే తెలియాలి. కానీ సినీ పరిశ్రమలో యువహీరోలు నిలద్రొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే వైవాహిక సమస్యలు కూడా మొదలవుతుండటంతో ఇటు సినీ కెరీర్, అటు వ్యక్తిగతజీవితం రెండూ దెబ్బతింటున్నాయి. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో ఈరకం సమస్యలు తరచూ కనబడుతున్నాయి. వారు నటిస్తున్న సినిమాలలాగే వారి నిజజీవితంలో నాటకీయ పరిణామాలు జరుగుతుండటం.. చివరకు వారి జీవితాలు ఈవిధంగా అస్తవ్యస్తం కావడం చాలా బాధాకరమే.