జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తెలంగాణా రాష్ట్రంలో పర్యటించి, ఆ తరువాత ఏపిలో పర్యటిస్తున్నారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైన ఒక నిర్దిష్ట లక్ష్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొంటాడు. పార్టీ నిర్మాణం, తమ పార్టీ ఆశయాలను, లక్ష్యాలను, ఎన్నికల ఆలోచనలను ప్రజలకు వివరించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించి ప్రభుత్వాలను నిలదీయడం...తద్వారా పార్టీ ఉనికిని గట్టిగా చాటుకోవడం చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి లక్ష్యం లేకుండానే యాత్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయన తెలంగాణాలో పర్యటించినప్పుడు తాను ఎవరితోను పోట్లాడటానికి రాలేదంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను గట్టిగా వెనకేసుకువస్తూ మాట్లాడారు. అనంతపురంలో పర్యటిస్తున్నప్పుడు తెదేపా మంత్రి పరిటాల సునీతను కలిసి మాట్లాడారు. తద్వారా తెదేపా, తెరాసలను జనసేన పార్టీ వ్యతిరేకించడంలేదని చెప్పినట్లయింది.
తెలంగాణాలో కొత్తగా ఆవిర్భవించిన ‘బహుజన వామపక్ష ఫ్రంట్’ రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేయబోతోందో ఇప్పుడే చెప్పలేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతటితో ఆగకుండా రైతులకు మేలు చేసే పార్టీలకే ‘మద్దతు’ ఇస్తానని చెప్పారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా జనసేన పోటీ చేయడం అనుమానమేననిపిస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తాము మేలు చేస్తున్నామనే చెప్పుకొంటున్నాయి కనుక వచ్చే ఎన్నికలలో జనసేన తెరాస, తెదేపాలకే మద్దతు ఇచ్చి, రెండు రాష్ట్రాలలో చెరో మూడు నాలుగు సీట్లతో సర్దుకుపోతారేమో? ఆ మాత్రం దానికి పార్టీ పెట్టడం ఈ హాడావుడి అంతా ఎందుకు?అనే సందేహం కలుగుతుంది. దానికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. 25 ఏళ్ళ సుదీర్ఘ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కనుక వచ్చే ఎన్నికలలో తెదేపా, తెరాసలకు మద్దతుగా ప్రచారం చేసి, తరువాత మళ్ళీ 2024 ఎన్నికల వరకు సినిమాలు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారేమో?ఈ గమ్యమెరుగని పయనం ఎంతకాలం ఏవిధంగా సాగుతుందో ఎవరికీ తెలియదు. బహుశః పవన్ కళ్యాణ్ కూడా తెలియదేమో?