ఒకప్పుడు కెసిఆర్ ‘చెల్లెలు హోదా’లో తెరాసలో చక్రం తిప్పిన విజయశాంతి ఇప్పుడు అదే ‘అన్నయ్య’పై విమర్శలు గుప్పించడం విశేషం. ఆమె హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఈ కెసిఆర్ ఉద్యమకాలంనాటి కెసిఆర్ కారు. అప్పుడు కెసిఆర్ తెలంగాణా రాష్ట్రం కోసం పరితపించారు కానీ ఇప్పుడు అధికారం కోసం పరితపిస్తున్నారు. బంగారి తెలంగాణా చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని ఇత్తడి తెలంగాణాగా మార్చేశారు. అయన అహంభావంతో, అతివిశ్వాసంతో చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణా కోసం పోరాడినవారిని పోలీసుల చేత నిర్బందింపజేస్తూ, తెలంగాణా ద్రోహులను వెనకేసుకువస్తున్నారు. మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాంలను అరెస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ యాత్రకు అనుమతించడమే అందుకు తాజా ఉదాహరణ. అయన తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక ఇప్పటికైనా అయన తన తీరు మార్చుకొంటే తెరాసకే మంచిది.
నా పార్టీని తెరాసలో విలీనం చేయమని కెసిఆర్ చాలాసార్లు అడిగినా నేను అంగీకరించలేదు కానీ జయశంకర్ సార్ చెప్పడంతో విలీనం చేసి కెసిఆర్ నేతృత్వంలో పోరాడాను. కానీ చివరికి ఆయన చేతిలోనే నేను మోసపోయి తెరాస నుంచి బయటకురావలసి వచ్చింది. ఇక ఎన్నికలలో పోటీ చేయకూడదని అనుకొన్నాను కానీ మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో తప్పకుండా పోటీ చేయలని నన్ను ఆదేశించారు. కనుక పోటీ చేయబోతున్నాను. అయితే నేను ఏదో ఒక నియోజకవర్గానికే పరిమితం కాదలచుకోలేదు. మా పార్టీ అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి పార్టీని బలోపేతం చేయాలనుకొంటున్నాను.
ఇంతకాలం కొన్ని కారణాల వలన రాజకీయలకు దూరంగా ఉన్నాను కానీ ఇకపై పూర్తి సమయం రాజకీయాలలోనే ఉంటాను. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను. నా రెండు దశాబ్దాల రాజకీయాలలో తెలంగాణా సాధన కోసం చేసిన పోరాటాలే నాకు ఎక్కువ తృప్తినిచ్చాయి,” అని అన్నారు.
తెలంగాణాలో జనసేన పోటీ చేయడం గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “ఇదివరకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే తెలంగాణా ప్రజలు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఎవరు పట్టించుకొంటారు? తెలంగాణాలో జనసేన ఒక్క సీటు సాధించుకొన్నా గొప్పే!” అని అన్నారు విజయ శాంతి.