నష్టాలలో కూరుకుపోతున్న ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం 2018లో అక్షరాలా రూ. 88, 139 కోట్లు మూలధన నిధిగా సహాయం అందించబోతోందని దాని వలన బ్యాంకులకు ‘మంచి బూస్టింగ్’ లభిస్తుందని మీడియా గట్టిగా బాకా ఊదేసింది. ఈ మొత్తంలో రూ.80,000 కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా రూ.8,139 కోట్లు బడ్జెట్ కేటాయింపు ద్వారా అందించబోతోంది.
కేంద్రం నుంచి ఈ బారీ ఆర్ధిక సహాయం అందుకోబోతున్న బ్యాంకులలో ఎస్.బి.ఐ.(8,800 కోట్లు), పి.ఎన్.బి.(5,473 కోట్లు), బి.ఓ.బి.( 5,375 కోట్లు), కెనరా బ్యాంక్ (4,865 కోట్లు), యూనియన్ బ్యాంక్ (4,524 కోట్లు), సిండికేట్ బ్యాంక్ (2,839 కోట్లు), ఆంధ్రా బ్యాంక్ (1,890 కోట్లు), విజయ బ్యాంక్ (1,277 కోట్లు) పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ (785 కోట్లు) ఉన్నాయి.
2018 ఆర్ధిక సంవత్సరంలో ఈ బ్యాంకులన్నిటిలో కలిపి మొండిబకాయిల పద్దులో రూ.9.5 లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులు పేరుకుపోతాయని అసోచాం రెండు రోజుల క్రితమే ఒక నివేదికలో బయటపెట్టింది. అంటే ఆ బ్యాంకులు రాజకీయ నాయకులకు, వారి బంధుమిత్రగణాలకు, వారి బినామీ కాంట్రాక్ట్ కంపెనీలకు, రాజకీయ పరిచయాలు పలుకుబడి కలిగిన బడా పారిశ్రామికవేత్తలకు, కార్పోరేట్ సంస్థలకు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక, వారు కుదువపెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోలేని కారణంగా వాటివద్ద పోగయిన ఈ అప్పులకు ‘నిరర్ధక ఆస్తులు’ అనే అందమైన పేరు పెట్టుకొన్నాయి. వాటి వలన ఆ బ్యాంకులకు కలిగిన నష్టాలను భర్తీ చేయడానికి కేంద్రం చాలా ఉదారంగా రూ. 88, 139 కోట్లు సహాయం అందించబోతోందన్నమాట!
ఉదాహరణకు విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోతే, అతనిని భారత్ తిరిగి రప్పించలేక, అతనికి ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోలేక ఆ బాకీని ‘నిరర్ధక ఆస్తుల పద్దు’లో చేర్చి, ఆ తరువాత దానిని ‘తిరిగి వసూలు చేయలేని మొండిబకాయి’గా వ్రాసేసుకొని పక్కన పెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు కనుక అందరికీ అతని నిర్వాకం గురించి తెలిసింది. కానీ ఆవిధంగా బ్యాంకులకు కుచ్చు టోపీ పెడుతున్నవారు దేశంలో ఇంకా అనేక వందలు, వేలమంది ఉన్నారు. అయితే వారెవరూ భారత్ విడిచి పారిపోకుండా తమ రాజకీయ పలుకుబడితో బ్యాంకులకు బాకీలు చెల్లించకుండా తప్పించుకొంటున్నారు గనుకనే బ్యాంకుల వద్ద రూ.9.5 లక్షల ‘నిరర్ధక ఆస్తులు’ పోగయ్యాయని అర్ధం అవుతోంది.
అంటే బడాబాబులు రుణాలు పేరుతో బ్యాంకులను దోచుకొంటుంటే, వారిని పట్టుకొని ఆ డబ్బు అసలు, వడ్డీ, జరిమానాలతో సహా వసూలు చేయకుండా, వారి చేతిలో మోసపోతున్న బ్యాంకులకు కేంద్రం మళ్ళీ ఆర్ధిక సహాయం అందిస్తూ అవి కుప్పకూలిపోకుండా నిలబెడుతోందన్న మాట! అప్పుడు మళ్ళీ అవి వారికి కొత్త అప్పులు ఇవ్వగలుగుతాయన్న మాట!
కేంద్రం వాటికి అందించబోయే ఆ అక్షరాలా రూ. 88, 139 కోట్లు దేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజలు కష్టార్జితం నుంచి కట్టిన పన్నుల నుంచి వచ్చేదేనని వేరే చెప్పనక్కరలేదు. దేశంలో సామాన్యులను పీడించి వసూలు చేసిన పన్నులతో బడాబాబులకు "తిరిగి చెల్లించనవసరం లేని లక్షల కోట్ల రుణాలు" అందించడం అంటే కాకులను కొట్టి గద్దలకు వేయడమే కదా?