ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళగా అయన కుర్చీలో తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సెటిల్ అయిపోయారు. అంటే ఒకనాడు చంద్రబాబు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెదేపా ఎమ్మెల్యేలను కూడగట్టి ముఖ్యమంత్రి అయినట్లు కాదు. సిఎం క్యాంప్ ఆఫీసులో మంత్రులు, అధికారులతో సమావేశమైనప్పుడు, ఆ కుర్చీ ఖాళీగా ఉంది కదా అని దానిలో కూర్చొని లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. అంతే! కానీ అయన సిఎం కుర్చీలో కూర్చొని సమావేశం నిర్వహించడం చూసి మంత్రులు, అధికారులు షాక్ అయ్యారు.
బాలకృష్ణ ఉప ముఖ్యమంత్రి కాదు గదా..కనీసం మంత్రి కూడా కాదు. అయన ఒక ఎమ్మెల్యే (హిందూపురం) మాత్రమే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వియ్యంకుడు, ఐటి మంత్రి నారా లోకేష్ కు మావగారు కనుక ఆ కుర్చీ ‘మనదే’ అనే భావనతో కూర్చోన్నారో లేక ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలనే తన మనసులో కోరికను ఈవిధంగా తీర్చుకొన్నారో తెలియదు. కానీ అది చూసి అందరూ షాక్ అయ్యారు. అది తప్పని ఎవరూ ఆయనకు చెప్పే సాహసం చేయలేదు. చేస్తే ఏమవుతుందో ఊహించడం కూడా కష్టమే. కానీ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి లేనప్పుడు ఎవరూ అయన కుర్చీలో కూర్చోకూడదు. ప్రోటోకాల్ ను పక్కన బెట్టినా ఎవరూ ఆ కుర్చీలో కూర్చోకూడదనే సంగతి అందరికీ తెలుసు. కానీ బాలకృష్ణకు అటువంటి పట్టింపులు ఏవీ ఉన్నట్లు లేదు. కనుక దీనిపై చంద్రబాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ బాలకృష్ణ కూర్చోవడం పెద్ద తప్పు కాదని సమర్ధించుకొంటే, రేపటి నుంచి ఏ ఎమ్మెల్యే అయినా దానిలో కూర్చోవచ్చని అనుకోవాల్సి ఉంటుంది.