డికె అరుణ డిల్లీ ఎందుకు వెళ్ళారో?

January 24, 2018


img

కాంగ్రెస్ అధిష్టానం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడి ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని హెచ్చరించడంతో చల్లబడిన కాంగ్రెస్ నేతలు మళ్ళీ యధాప్రకారం ముఠాలు కట్టి కీచులాటలు ప్రారంభించారు. అందుకు నిదర్శనంగా మాజీ మంత్రి డికె అరుణ తన అనుచరులతో కలిసి నిన్న డిల్లీ ప్రయాణం అవడాన్ని చెప్పుకోవచ్చు. పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్నవారిలో ఆమె కూడా ఒకరు. అదేవిషయమై రాహుల్ గాంధీతో మాట్లాడటానికి వెళ్ళారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ ఆమె వేరే పని మీద డిల్లీ వెళ్ళినట్లు మరోవర్గం చెపుతోంది. భాజపా నేత నాగం జనార్ధన రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని, నాగర్ కర్నూల్ శాసనసభ టికెట్ మళ్ళీ కె దామోదర్ రెడ్డికే ఇవ్వాలని కోరడానికి ఆమె డిల్లీ వెళ్ళినట్లు సమాచారం. ఒకవేళ దామోదర్ రెడ్డిని కాదని జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనకే టికెట్ ఇస్తే, ఇప్పటికే సగం ఖాళీ అయిపోయిన నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంటుందని ఆమె హెచ్చరించబోతున్నారుట!

అలాగే ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో జైపాల్ రెడ్డికి బదులు ఎంపి నందిని యాదవ్ కు అవకాశం కల్పించాలని కోరబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులన్నీ రెడ్డి కులస్తులకే లభిస్తాయనే దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టాలంటే దళితుడైన నంది యల్లయ్యకు వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇవ్వాలని కోరబోతున్నారుట! 

ఇక పిసిసి అధ్యక్ష పదవి కోసం ఆరాటపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరి ప్రయత్నంగా ఫిబ్రవరిలో ఒకసారి డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి మళ్ళీ అభ్యర్ధించబోతున్నారని తాజా సమాచారం. ఒకవేళ రాహుల్ గాంధీ అందుకు అంగీకరించకపోతే, పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ ఏకత్రాటిపైకి వచ్చి పార్టీని తెరాసకు ఏకైక ప్రత్యామ్నయం అని ప్రజలు భావించేలా చేయగలుగుతున్నారు. కానీ పార్టీలో మళ్ళీ గ్రూపు రాజకీయాలు మొదలవడం నిజమైతే, వచ్చే ఎన్నికలలో అదే కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారడం ఖాయం.   



Related Post