ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారపార్టీకే అమ్ముడుపోతారు!

January 24, 2018


img

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ, “కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంతగా భ్రష్టు పట్టిస్తారని మేము ఊహించలేదు. గతంలో కూడా రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయించేవారు. కానీ కెసిఆర్ హయంలో అది పరాకాష్టకు చేరింది. దానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. 1 దిగజారుడు రాజకీయాలు. 2. రాజకీయ నాయకులు నిసిగ్గుగా అమ్ముడుపోవడానికి సిద్దపడటం. 

సుఖేందర్ రెడ్డి ఎందుకు, ఎంతకు అమ్ముడుపోయాడో అందరికీ తెలుసు. పార్టీ ఫిరాయించినందుకు బదులుగా ఆయనకు, అయన కుటుంబ సభ్యులకు లభించిన కాంట్రాక్టుల వివరాలు మావద్ద ఉన్నాయి. 2014ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా తరపున 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో 12 మందిని తెరాసలోకి ఫిరాయింపజేయడం చూస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఉందా అనిపించకమానదు. ఎవరు ఏ పార్టీ తరపున గెలిచినా, చివరికి అధికార పార్టీకి అమ్ముడుపోతున్నప్పుడు ఇక ప్రజలు వారికి ఓట్లేసి ఏమి ప్రయోజనం? ప్రజలను అపహాస్యం చేసినట్లే కదా?” అని అన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమే కానీ ఆయన కూడా కెసిఆర్ బాటలోనే పయనిస్తూ స్వయంగా తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని డిల్లీకి తోడ్కోనిపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం, నేటికీ రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడం గురించి మాట్లాడలేదు. అలాగే సంక్రాంతి తరువాత తెరాసతో సహా ఇతర పార్టీల నుంచి బారీగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయని ఆయనే పదేపదే చెపుతున్న సంగతి ప్రస్తావించలేదు.    

వాస్తవానికి తెలంగాణాలో తెరాస తప్ప మరొక రాజకీయ పార్టీ ఏదీ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పార్టీ ఫిరాయింపుల కార్యక్రమం మొదలుపెట్టారనే సంగతి అందరికీ తెలుసు. దానికి ‘బంగారి తెలంగాణా సాధన’ అనే అందమైన కారణం ‘రాజకీయ పునరేకీకరణ’ అనే మరో అందమైన ముసుగువేసి నేటికీ దానిని కొనసాగించడమే కాకుండా ఇతర పార్టీల నుంచి ఎంతమందిని చేర్చుకొంటే అంత గొప్ప అన్నట్లు చెప్పుకొంటున్నారు కూడా. అయితే తెరాస తీరును విమర్శిస్తున్న కాంగ్రెస్, భాజపాలు కూడా అదే బాటలో ప్రయాణించడం తప్పు కాదు అనే అభిప్రాయానికి వచ్చినట్లు వాటి నేతల మాటలను బట్టి అర్ధం అవుతోంది. ఒకవేళ 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఓ 10 సీట్లు తక్కువపడితే ఏమి చేస్తుంది? నైతిక విలువలకు కట్టుబడి అధికారం వదులుకొంటుందా...లేక ఎమ్మేల్యేలను కొనుగోలు చేస్తుందా?కనుక అన్ని పార్టీలు కలిసి ఈ ఫిరాయింపుల ప్రక్రియను ఆమలుచేసుకొంటున్నప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజలు, నైతిక విలువలు...అని పడికట్టు పదాలు వల్లె వేయడం ఎందుకు? అందరూ కలిసి రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్య విలువలను దిగజార్చి బురద జల్లుకొంటున్నప్పుడు మళ్ళీ బాధపడటం ఎందుకు?


Related Post