రైతన్నల ఆత్మహత్యలు ప్రభుత్వానికి అప్రదిష్ట కాదా?

January 24, 2018


img

దేశంలో అన్ని రాష్ట్రాలలోకి తెలంగాణా రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా...అంటూ తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకొని రోజంటూ లేదు. రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా దేశంలో మహారాష్ట్ర తరువాత తెలంగాణా రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని ‘సౌత్ ఎంక్లేవ్-2018’ సదస్సులో సాక్షాత్ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒప్పుకొన్నారు. రైతన్నలే కాదు చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారని చెపుకొని బాధపడ్డారు కూడా. రైతులు, చేనేతన్నల కోసం తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించారు. అయినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. 

నిన్న మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు  రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇంకా విషాదకరమైన విషయమేమిటంటే వారిలో యామ చంద్రకళ (41) అనే ఒక మహిళా రైతు కూడా ఉంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లికి చెందిన ఆమె తన భర్త అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో వ్యవసాయం చేయకతప్పలేదు. తన రెండెకరాల పొలంతో పాటు మరో 8 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తోంది. కానీ పంటకు, భర్త వైద్యానికి చేసిన రూ.10 లక్షలు అప్పు తీర్చలేకపోవడంతో అప్పులవల్ల ఒత్తిడి పెరిగిపోయింది. ఈ బాధలు భరించలేక పురుగులమందు త్రాగి ఆత్మహత్య చేసుకొంది. 

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఆడెల్లి తండాలో రాధోడ్ అనిల్ (33) అనే పత్తి రైతు అప్పులవాళ్ళ వేధింపులను భరించలేక పురుగులమందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో మోతిరా తండాకు చెందిన బానోతు సంతోష్ (35) అనే యువరైతు అప్పులవాళ్ళ ఒత్తిడి భరించలేక గ్రామలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

జగిత్యాల్ రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామానికి చెందిన గంగాధర రాజం (53) వ్యవసాయం కోసం, కొడుకును దుబాయ్ పంపించడం కోసం రూ.9 లక్షలు అప్పుచేసి తీర్చలేక ఈ నెల 12వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నాడు.

రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తున్న మాట వాస్తవం. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున మాట వాస్తవమే. కానీ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులు అందరూ అప్పులవాళ్ళ వేధింపులు భరించలేక లేదా చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ఈ సమస్యపై అధ్యయనం చేయించి పరిష్కార మార్గాలు కనుగొని అమలుచేయడం మంచిది లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మంచి, గొప్ప పనులు చేసినా ఈ మచ్చ మిగిలిపోతుంది.      



Related Post