మహారాష్ట్రలో మిత్రపక్షాలుగా ఉన్న భాజపా-శివసేన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. కానీ మొదటి నుంచి వాటి మద్య సఖ్యత ఏర్పడలేదు. ఇక ముందు ఏర్పడే సూచనలు కూడా కనబడటం లేదు. అందుకే భాజపాతో దోస్తీకి కటీఫ్ చెప్పేసి వేరుపడుతున్నట్లు శివసేన ఈరోజు ముంబైలో ప్రకటించింది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది. అంటే అప్పటి వరకు అది రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగే అవకాశాలున్నాయని భావించవచ్చు.
అక్కడ మహారాష్ట్రలో శివసేన భాజపాకు దూరం జరిగితే, ఏపిలో తెదేపా కూడా భాజపాకు దూరం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో భాజపా కంటే శివసేనకే ఎక్కువ పట్టుంది. అదేవిధంగా ఏపిలో తెదేపాకే ఎక్కువ పట్టుంది. కనుక ఇంతవరకు మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, తెదేపాలనే వచ్చే ఎన్నికలలో భాజపా ఎదుర్కోవలసిరావచ్చు. ఏపిలో తెదేపా దూరం జరుగుతుంటే, తెలంగాణా రాష్ట్రంలో భాజపాయే తెదేపాకు దూరం జరిగింది. ఆ కారణంగా అది ఇంకా బలహీనపడింది. ఆ కారణంగా ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి పరిణామాలు జరుగడం భాజపాకు చాలా ఆందోళన కలిగించే విషయమేనని చెప్పవచ్చు.