వాటిపై తెరాస ముద్రవేయడానికే..

January 23, 2018


img

తెరాస మంత్రులు కనుసన్నలలో తెరాస నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులలో సుమారు 1.8 లక్షలమంది సభ్యులున్నారు. వాటి కూర్పు పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిస్తూ, “వాటిలో మాకు అనుకూలమైనవారినే నియమించుకొంటేనే వారు మా లక్ష్యసాధనకు సహకరిస్తారు. మా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు చెందినవారిని నియమించుకొంటే వారు మాకు సహకరించరు కదా! కనుక రైతు సమన్వయ సమితిలలో మావారిని నియమించుకోవడం తప్పు కాదు,” అని శాసనసభలోనే కుండబ్రద్దలు కొట్టినట్లు తన మనసులో మాట చెప్పారు. కనుక ఈ రైతు సమన్వయ సమితులు కూడా తెరాసకు అనుబంధంగా పనిచేసే కార్మిక, విద్యార్ధి, ఉద్యోగ సంఘాల మాదిరిగానే పనిచేయబోతున్నాయని స్పష్టం అవుతోంది.

వాటి సభ్యులందరికీ దిశానిర్దేశం చేయడానికి త్వరలోనే జిల్లా స్థాయి సభలు నిర్వహించి, ఆ తరువాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రైతు సమన్వయ సమితి సభ్యులందరితో ఒక బారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి తెరాస సన్నాహాలు ప్రారంభించినట్లు తాజా సమాచారం. ఈ సభలతో వాటిపై పూర్తిగా గులాబీ ముద్ర వేసినట్లవుతుంది కనుక మే నెలలో వారిద్వారా రైతులకు పంట పెట్టుబడి చెక్కులు పంపిణీ చేసి, రాష్ట్రంలో రైతులందరినీ మెల్లగా తెరాస వైపు మళ్ళించవచ్చు. ఇటువంటి రాజకీయ ప్రయోజనం ఆశించే రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసినప్పటికీ, రైతుల సంక్షేమం కోసం వాటిని ఏర్పాటు చేశామని చెప్పుకోవడం తెరాసకే చెల్లు. 


Related Post